US Federal Court: టారిఫ్ లు విధించేందుకు ట్రంప్ కు హక్కు లేదు.. యూఎస్ అప్పీల్ కోర్ట్ స్ట్రోక్..

ప్రపంచదేశాలపై టారిఫ్ ల మోత మోగిస్తూ, బెదిరింపులకు దిగుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు.. ఆ దేశ కోర్టు గట్టి షాకిచ్చింది. ట్రంప్ విధించిన సుంకాలు (US Tariffs) చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్‌లను పెంచినట్లు పేర్కొంది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్‌లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయాన్ని యూఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది. అప్పీల్ కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టులో పోరాడతామన్నారు..
టారిఫ్ లపై కోర్టు నిర్ణయాన్ని ట్రంప్ విమర్శించారు. ఈమేరకు తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. ‘‘అన్ని దేశాలపై విధించిన సుంకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని పక్షపాత అప్పీల్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రక్రియలో చివరకు అమెరికా విజయం సాధిస్తుంది. ఒకవేళ ఈ టారిఫ్‌లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుంది. అమెరికా మరింత బలపడాలి. కానీ ఈ నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తుంది. వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి సుంకాలు ఇప్పటికీ అత్యుత్తమ మార్గం.
మన తయారీదారులను, రైతులను అణగదొక్కేందుకు మిత్ర దేశాలైనా, శత్రుదేశాలైనా అనైతికంగా విధించే టారిఫ్‌లు, అపారమైన వాణిజ్య లోటు, వాణిజ్య అడ్డంకులను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఒక వేళ టారిఫ్‌లు ఎత్తివేస్తే ఈ నిర్ణయం అమెరికాను నాశనం చేస్తుంది. మన కార్మికులకు సహాయం చేయడానికి ఇదొక్కటే సరైన మార్గం అని గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ఉత్పత్తులను తయారు చేస్తున్న మన కంపెనీలకు మద్దతుగా నిలబడాలి. చాలా ఏళ్లుగా మన రాజకీయ నాయకులు టారిఫ్‌లను మనకు వ్యతిరేకంగా ఉపయోగించారు. యూఎస్ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్‌లను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అమెరికాను బలమైన, ధనిక, శక్తివంతంగా మారుస్తాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA)ను అమలులోకి తెచ్చారు. దీంతో అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీగా సుంకాలు విధించారు. బేస్‌లైన్‌గా 10 శాతం టారిఫ్‌లు విధించారు. ఇక భారత్‌పై తొలుత 25 శాతం టారిఫ్‌లు విధించగా, రష్యా నుంచి భారత్ చమురును తక్కువకు కొని లబ్ధి పొందుతోందని అనంతరం వాటిని 50 శాతానికి పెంచారు. ఈనెల 27 నుంచి పెంచిన టారిఫ్‌లు అమల్లోకి తెచ్చింది అమెరికా.