Donald Trump: కేబినెట్ మీటింగ్‌లో కునుకు తీసిన ట్రంప్.. ఆరోగ్యంపై చర్చ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోగ్యం మరోసారి చర్చకు దారితీసింది. వైట్‌హౌస్‌లో జరిగిన సుదీర్ఘ క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ నిద్రమత్తుతో జోగుతూ కనిపించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో తెగ చర్చ మొదలైంది. “నేను 25 ఏళ్లనాటి కంటే మరింత ఉత్సాహంగా ఉన్నాను” అని ట్రంప్ కామెంట్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో బయటకు రావడం గమనార్హం.
సుమారు రెండు గంటల పాటు సాగిన సమావేశం ప్రారంభంలో అధ్యక్షుడు (Donald Trump) తన ఆరోగ్యం గురించి వచ్చిన కథనాలను ఖండించారు. అయితే సమావేశం మొదలైన కొద్ది సేపటికే ఆయన కళ్లు మూసుకొని, కుర్చీలో వాలినట్లు కనిపించినట్లు వీడియో ఫుటేజీ చూపించింది. ముఖ్యంగా మంత్రులు తమ శాఖల వివరాలు సమర్పిస్తున్న సమయంలో ట్రంప్ పలుమార్లు 10–15 సెకన్ల పాటు కునుకు తీసినట్లు ఆ క్లిప్‌లలో కనిపించింది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) మాట్లాడుతుండగా కూడా ట్రంప్ నిద్రమత్తులో ఉన్నట్లు స్పష్టంగా రికార్డైంది.
ఈ ఆరోపణలను వైట్‌హౌస్ గట్టిగా తోసిపుచ్చింది. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. “ప్రెసిడెంట్ ట్రంప్ (Donald Trump) పూర్తిగా అలర్ట్‌గా మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడిన తీరు, చివర్లో విలేకరుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు అన్నీ ఆయన దృష్టి, చురుకుదనాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి” అని తెలిపారు.
79 ఏళ్ల ట్రంప్ (Donald Trump) ఆరోగ్యం గత కొంతకాలంగా చర్చనీయాంశమవుతోంది. ఆయనకు ‘క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ’ అనే సమస్య ఉన్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ, అక్టోబర్‌లో జరిగిన తాజా పరీక్షల్లో వైద్యులు ఆయనను ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు.






