Revanth Reddy: హిందూ మతం, కాంగ్రెస్ సిద్ధాంతం ఒక్కటేనా? రేవంత్ అంతరార్థం ఏంటి..!?
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఒకవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని, ఇతర కేంద్ర మంత్రులను కలుస్తూ పాలనాపరమైన అంశాలపై చర్చిస్తూనే, మరోవైపు తన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. హిందూ దేవతలను (Hindu Gods) ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, వాటిని బీజేపీ అస్త్రంగా మలుచుకోవడం, దానికి రేవంత్ ఇచ్చిన వివరణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, నాయకత్వ తీరుపై దిశానిర్దేశం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైన పోలిక తెచ్చారు. “కాంగ్రెస్ పార్టీ సరిగ్గా హిందూ సమాజం లాంటిదే” అని ఆయన అభివర్ణించారు. “హిందూ మతంలో కోట్లాది మంది దేవుళ్లు ఉన్నారు. పెళ్లి కాని వారికి హనుమంతుడు, రెండు పెళ్లిళ్లు చేసుకునేవారికి మరో దేవుడు, కల్లు తాగి కోడిని బలిచ్చే వారికి పోచమ్మ, మైసమ్మ లాంటి దేవతలు, పప్పన్నం తినే సాత్వికులకు వేరే దేవుడు ఉన్నారు. ఇలా ఎవరి అలవాట్లకు తగ్గట్టు వారికి దేవుళ్లు ఉన్నట్లే, కాంగ్రెస్ పార్టీలో కూడా అందరికీ చోటు ఉంటుంది.” అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. పార్టీలోని బహుళత్వాన్ని చెప్పడమే రేవంత్ ఉద్దేశం అయినప్పటికీ, బీజేపీ దీన్ని హిందూ దేవుళ్లను అవమానించడంగా పరిగణించి విమర్శల దాడిని ప్రారంభించింది.
ఉత్తర భారతదేశంలో బీజేపీ ఈ వీడియో క్లిప్పులను విపరీతంగా ప్రచారం చేస్తోందని, తద్వారా తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే, ఈ విమర్శలను ఆయన చాలా వ్యూహాత్మకంగా తిప్పికొట్టారు. “ఉత్తరాదిన బీజేపీ నన్ను ఇంతగా పాప్యులర్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది” అంటూ సెటైరికల్ గా స్పందించారు. నిజానికి తాను కాంగ్రెస్ పార్టీలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని వివరిస్తూ హిందూ మతంలోని వైవిధ్యాన్ని చెప్పానన్నారు. బీజేపీ నేతలు తన ప్రసంగాన్ని ఎడిట్ చేసి, వక్రీకరించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన ఆవేదనతోనే వారు ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే, ఆయన కేవలం హిందూ మతాన్ని విమర్శించడం లేదని, తెలంగాణలోని గ్రామీణ దైవారాధన సంస్కృతిని తెరపైకి తెచ్చారని అర్థమవుతుంది. ఎల్లమ్మ, పోచమ్మ వంటి దేవతలను ప్రస్తావించడం ద్వారా, అట్టడుగు వర్గాల సంస్కృతిని, వైదిక హిందూ ధర్మానికి భిన్నంగా ఉండే ఆచారాలను ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని వర్గాల వారిని కలుపుకుపోతుందని చెప్పడమే ఆయన అంతిమ లక్ష్యం. అయితే, బీజేపీ దీనిని దేవుళ్లను కించపరిచారనే కోణంలో ఫోకస్ చేస్తూ వివాదాస్పదం చేస్తోంది.
మొత్తానికి, రేవంత్ రెడ్డి చేసిన కాంగ్రెస్, హిందూ మతం ఒక్కటే అనే కొత్త నిర్వచనం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఒకవైపు బీజేపీ దీన్ని మతపరమైన అంశంగా చూస్తుంటే, రేవంత్ రెడ్డి దీన్ని సామాజిక, సాంస్కృతిక వైవిధ్యంగా సమర్థించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ దైవ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.






