SP Balasubramanyam: గాన గంధర్వుడికి ప్రాంతీయ సంకెళ్లు..!!
సంగీతానికి ఎల్లలు ఉండవు, స్వరానికి సరిహద్దులు ఉండవు అని మనం తరచూ చెప్పుకుంటాం. కానీ, ఆ వాక్యాలు కేవలం పుస్తకాలకే పరిమితమా? అనే సందేహాన్ని లేవనెత్తుతోంది హైదరాబాద్‌లోని (Hyderabad) తాజా పరిణామం. భారతీయ సినీ సంగీత సామ్రాజ్యంలో రారాజుగా వెలుగొందిన దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubramanyam) విగ్రహావిష్కరణపై (Statue) తెలంగాణలో అగ్గి రాజుకుంది. హైదరాబాద్ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతి (Ravindra Bharathi) వేదికగా పెద్ద దుమారాన్నే రేపుతోంది.
ఈ నెల 15న రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ కొన్ని తెలంగాణ సంఘాలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తాజాగా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన బాలు బావ, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్‌ను అడ్డుకుని, ఆయనతో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆంధ్రా గాయకుడి విగ్రహాన్ని తెలంగాణ సాంస్కృతిక వేదిక అయిన రవీంద్ర భారతిలో ఎలా పెడతారని ఆందోళనకారులు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కళాకారుల విగ్రహాలు ఉండాల్సిన చోట, ఒక ఆంధ్రా వ్యక్తి విగ్రహం పెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
నిజానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం నెల్లూరు జిల్లాలో పుట్టినప్పటికీ, ఆయన ప్రస్థానం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ఆయన కీర్తి విశ్వవ్యాప్తం. దాదాపు 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి గిన్నీస్ రికార్డు సృష్టించిన ఘనత ఆయనది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాసులో ఉన్నా, హైదరాబాద్‌కు తరలివచ్చినా ఆయన తన గొంతుతో దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించారు. ‘పాడుతా తీయగా’ వంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది తెలంగాణ గాయనీ గాయకులను వెలుగులోకి తెచ్చారు. అలాంటి వ్యక్తిని కేవలం ఆంధ్రా ప్రాంతానికి చెందినవాడు అని ముద్రవేసి చూడటం, ఆయన కళామ్మతల్లికి చేసిన సేవను అవమానించడమే అవుతుందన్నది సంగీత ప్రియుల ఆవేదన.
ఈ వివాదంలో అత్యంత ఆసక్తికరమైన, ఆలోచించాల్సిన విషయం మరొకటి ఉంది. భాష, ప్రాంతీయ అస్తిత్వం విషయంలో తమిళనాడు ప్రజలు, అక్కడి ప్రభుత్వాలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ, బాలు మరణానంతరం తమిళనాడు ప్రభుత్వం ఆయనకు సముచిత గౌరవం కల్పించింది. చెన్నైలోని ఒక ప్రముఖ వీధికి ఆయన పేరు పెట్టి, ఆయన స్మృతిని గౌరవించింది. పరాయి భాషా గాయకుడైనా, తమ గడ్డపై ఆయన చేసిన సేవను వారు గుర్తించారు. కానీ, సొంత తెలుగు గడ్డపై, ఆయన ఎంతగానో ప్రేమించిన హైదరాబాద్ నగరంలో నేడు ఆయన విగ్రహం పెట్టడానికి ప్రాంతీయ ద్వేషాలు అడ్డురావడం విడ్డూరం.
ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తే, ఇది కేవలం ఒక విగ్రహానికి సంబంధించిన గొడవలా కనిపించడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటిన విషబీజాలు ఇంకా సమాజంలో బలంగా నాటుకుపోయి ఉన్నాయనడానికి ఇదొక నిదర్శనం. అప్పట్లో రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ వంటి నాయకులు రెచ్చగొట్టిన ప్రాంతీయ ద్వేషాలు, రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ఇంకా చల్లారలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం కాస్తా, చివరకు “మన కళాకారులు – పరాయి కళాకారులు” అనే స్థాయికి దిగజారడం ఆందోళనకరం. రాజకీయ అవసరాల కోసం రగిలించిన ప్రాంతీయ విద్వేషం, నేడు సంస్కృతి, సంప్రదాయాల మధ్య అడ్డుగోడలు కడుతోంది.
హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరం. ఇక్కడ అన్ని ప్రాంతాల వారు, అన్ని భాషల వారు కలిసి జీవిస్తున్నారు. ఇలాంటి నగరంలో, కళాకారులను కుల, మత, ప్రాంతీయ అద్దాల్లోంచి చూడటం మన ప్రగతిశీల సమాజానికి మాయని మచ్చ. రవీంద్ర భారతి అనేది కళకు సంబంధించిన వేదిక. అక్కడ కళాకారుడికి పట్టం కట్టాలి తప్ప, అతడు పుట్టిన ఊరును చూసి కాదు. ఎస్పీ బాలు వంటి లెజెండ్ విగ్రహాన్ని అడ్డుకోవడం ద్వారా తెలంగాణ సమాజం తన గొప్పతనాన్ని చాటుకోలేదు, సరికదా సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నట్లవుతుంది. ఇప్పటికైనా రాజకీయ, సామాజిక వర్గాలు ఈ విషయంపై స్పందించి, కళను ప్రాంతీయ రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సిన అవసరం ఉంది.






