Germany: వలస విధానాలను సడలించిన జర్మనీ.. భారతీయులకు మంచి అవకాశం!
జర్మనీలో (Germany) నైపుణ్యంతో కూడిన సిబ్బంది కొరత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం వలస విధానాలను భారీగా సడలించింది. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఐటీ, హెల్త్‌కేర్, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక రంగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా టాలెంట్‌ను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో భారతీయ విద్యార్థులు, యువ నిపుణులు ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. కొత్త సంస్కరణల్లో భాగంగా వీసా జారీ ప్రక్రియ వేగవంతం చేయడం, ఈయూ బ్లూ కార్డ్‌కు కనీస జీత అర్హత తగ్గించటం, ‘ఆపర్చునిటీ కార్డ్’ అనే కొత్త ప్రవేశ మార్గాన్ని ప్రవేశపెట్టటం వంటి మార్పులను జర్మనీ (Germany) తీసుకొచ్చింది. దీంతో జర్మనీలో చదువు, ఉద్యోగ అవకాశాలను పొందడం మరింత సులభమైంది. ప్రత్యేకంగా దేశంలోని ప్రముఖ టీయూ9 సాంకేతిక విశ్వవిద్యాలయాలు ఈ వ్యూహంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, పునరుత్పాదక ఇంధనం వంటి భవిష్యత్ టెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక కోర్సులు అందిస్తూ విదేశీ ప్రతిభను జర్మనీ (Germany) ఆకర్షించనుంది. ఈ పరిణామంపై బోర్డర్‌ప్లస్ సీఈఓ మయాంక్ కుమార్ మాట్లాడుతూ.. “జర్మనీ పారిశ్రామిక లక్ష్యాలు, జనాభా సంక్షోభం కలిసి భారత యువతకు అపూర్వ అవకాశాలను కల్పిస్తున్నాయి” అన్నారు. టెర్న్ గ్రూప్ ఫౌండర్ అవినావ్ నిగమ్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం జర్మనీలో (Germany) సుమారు ఆరు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, రాబోయే సంవత్సరాల్లో మరెన్నో పోస్టులు రిటైర్మెంట్ల కారణంగా వెలువడనున్నాయి. మెకానికల్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వంటి స్టెమ్ కోర్సులకు డిమాండ్ పెరుగుతుందని కూడా ఆయన చెప్పారు.






