కోర్టు నుంచి అకస్మాత్తుగా బయటకు డొనాల్డ్ ట్రంప్
తనపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ కోర్టులో కొనసాగుతుండగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. న్యూయార్క్‌లోని మాన్హటన్ ఫెడరల్ కోర్టులో ఈ ఘటన జరిగింది. రచయిత్రి జీన్ కరోల్ దాఖలు చేసిన ఈ కేసులో వాదనలు ముగియాల్సి ఉంది. లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రంప్ తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యాలు చేశారన్నది ఆమె ఆరోపణ. కనీసం 12 మిలియన్ డాలర్లను పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వాదనలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ అనూహ్యంగా కోర్టు హాలు నుంచి బయటకు వెళ్లిపోవడంపై జడ్జి లెవిస్ ఎ.కప్లాన్ స్పందిస్తూ ఈ విషయమూ రికార్డు అవుతుందని తెలిపారు. వాస్తవానికి ట్రంప్ ఈ కేసు విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదు. అయితే, ట్రంప్ కోర్టుకు వచ్చిన సమయంలో ఆయన ముఖంలో ఆందోళన కనిపించింది.






