Global Summit: దావోస్ సమ్మిట్ తరహాలో .. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ : సీఎం రేవంత్
భారత్ ప్యూచర్ సిటీలో డిసెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ( Global Summit)-2025ను నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ప్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ -2025 ఏర్పాట్లను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ, ప్యూచర్‌సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ భవన సముదాయ నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రఖ్యాత సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నందున దావోస్ సమ్మిట్ (Davos Summit) తరహాలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్ నిర్వహించాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్‌ను ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని చెప్పారు. సదస్సుకు వివిధ దేశాల రాయబారులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ శివధర్రెడ్డినిఆదేశించారు. పాసులు లేకుండా, సమ్మిట్‌తో సంబంధం లేని వ్యక్తులు ఎవరూ ప్రాంగణంలోకి రావడానికి వీలులేదని స్పష్టం చేశారు. శాఖలవారీగా నిర్దేశించిన అధికారులకు మాత్రమే ప్రవేశం ఉండాలని చెప్పారు. అలాగే సమ్మిట్‌కు హాజరయ్యే మీడియా ప్రతినిధులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.






