Donald Trump : భారత్‌లో ఓటర్ల వ్యవస్థ భేష్ : డొనాల్డ్ ట్రంప్

భారత్ (India)తో పాటు బ్రెజిల్‌లోనూ ఓటర్ల నిర్వహణ వ్యవస్థలు బాగున్నాయని, రెండు దేశాలు ఓటర్ల గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్ (Database)తో అనుసంధానం చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసించారు. అదే అమెరికా స్వీయ ధ్రువీకరణతో సరిపెడుతోందని పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల వ్యవస్థలో పూర్తి స్థాయి సంస్కరణలను తీసుకొస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ( ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) ట్రంప్ సంతకం చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లోని ఎన్నికల వ్యవస్థలను ప్రస్తావించారు. మనం స్వయం పాలనలో ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం. కానీ అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో అమలు చేస్తున్న ప్రాథమికమైన, అవసరమైన ఎన్నికల రక్షణ విధానాలను పాటించడంలో విఫలమయ్యాం. ఉదాహరణకు భారత్, బ్రెజిల్ (Brazil)లు ఓటర్ల గుర్తింపు కార్డులను బయోమెట్రిక్ (Biometric) తో అనుసంధానం చేస్తున్నాయి. జర్మనీ, కెనడా పేపర్ బ్యాలెట్లను వినియోగిస్తున్నాయి. వాటిని అధికారుల సమక్షంలో బహిరంగంగా లెక్కిస్తున్నాయి. ఫలితంగా వివాదాలు తలెత్తడం లేదు. అదే అమెరికాలో ఓటింగ్ విధానాలు అనే వివాదాలను సృష్టిస్తున్నాయి అని ట్రంప్ పేర్కొన్నారు.