Donald Trump: మందుల ధరలు తగ్గిస్తాం కానీ .. మెడికేర్ కార్యక్రమానికే

అమెరికాలో మందుల (Medication) ధరలను ఫార్మా కంపెనీలు (Pharma companies) తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ధరలను తక్కువ చేసేందుకు వీలుకల్పించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. దీని ప్రకారం ఫార్మా కంపెనీలు 59 శాతం వరకు తమ మందుల ధరలను తగ్గించాల్సి వస్తుంది. ఇతరదేశాల్లో విక్రయిస్తున్న తక్కువ ధరలనే, అమెరికా (America)లోనూ వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. దీనివల్ల మందుల ధరలు 30-80 శాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. దీని కోసం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ విధానాన్ని అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తత్ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరలకు అమెరికాలో మందులు లభిస్తాయని అన్నారు. అయితే ఈ నూతన విధానం వల్ల అన్ని మందుల ధరలు తగ్గవు. మెడికేర్ పార్ట్-బి (Medicare Part-B) కార్యక్రమం కింద యూఎస్‌లోని ఆరోగ్య శాఖ సేకరించే మందులకే ఇది వర్తిస్తుంది. ఈ కార్యక్రమంలో కింద 2012లో 33 బిలియన్ డాలర్ల విలువైన మందులు కొనుగోలు చేశారు.