China: సోషల్ మీడియా ఫేక్ న్యూస్ కు డ్రాగన్ కత్తెర..!
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కుప్పలు తెప్పలుగా సమాచారం వచ్చి పడుతుంది. అందులో ఏది నిజమైందో, ఏది ఫేకో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే కేవలం సబ్ స్క్రిప్షన్ కోసం.. వేలాదిగా ఫేక్ న్యూస్ మేకర్లు.. నిరంతరం ఫేక్ న్యూస్ ట్రోల్ చేస్తూ వస్తున్నారు. వీరిని అరికట్టడం అంత సులభం కాదు. కానీ ఈ విషయంలో చైనా మాత్రం ఓ చక్కటి కార్యాచరణ ప్రకటించింది. దీన్ని అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది కూడా..!
సోషల్ మీడియాలో నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు చైనా (China) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై సున్నితమైన అంశాలపై మాట్లాడాలంటే ఇన్ఫ్లుయెన్సర్లు తప్పనిసరిగా వృత్తిపరమైన అర్హత కలిగి ఉండాలంటూ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. తప్పుడు సలహాలతో ప్రజలను తప్పుదోవ పట్టించకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ప్రకటించింది.
ఆరోగ్యం, విద్య, చట్టం, ఆర్థికం వంటి సున్నితమైన రంగాలపై సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేయాలంటే, దానికి సంబంధించిన డిగ్రీ, లైసెన్స్ లేదా సర్టిఫికేషన్ వంటి అధికారిక ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 25 నుంచి ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే సలహాల నుంచి కాపాడటమే తమ లక్ష్యమని చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఏసీ) స్పష్టం చేసింది.
ఈ నిబంధనల అమలు బాధ్యతను డౌయిన్ (టిక్‌టాక్ చైనా వెర్షన్), వీబో వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనే ఉంచారు. క్రియేటర్ల అర్హతలను, వారి పోస్టులను వెరిఫై చేయాల్సిన బాధ్యత ఈ సంస్థలదే. అంతేకాకుండా, మెడికల్ ఉత్పత్తులు, సప్లిమెంట్లను ‘ఎడ్యుకేషన్’ పేరుతో ప్రమోట్ చేయడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది.







