Jubilee Hills: జూబ్లీహిల్స్ బైపోల్ ఎఫెక్ట్… అజారుద్దీన్‌కు లక్కీ ఛాన్స్..!!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు (Telangana Politics) కీలక మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల 31న శుక్రవారం కేబినెట్ విస్తరణ (Cabinet Expansion) ఉండే అవకాశం ఉంది. ఈ విస్తరణలో కాంగ్రెస్ నాయకుడు, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు దీనికి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించాలనే వ్యూహాత్మక అడుగు వేసినట్లు స్పష్టమవుతోంది.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకపోవడంపై కొద్ది రోజులుగా రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అజారుద్దీన్‌కు మంత్రి పదవి కల్పించడం ద్వారా ముస్లింల ఆకాంక్షల తాము కట్టుబడి ఉన్నామనే సంకేతాన్ని రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. ఈ నిర్ణయం వెనుక ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రభావం బలంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం పరిధిలో పెద్దఎత్తున ముస్లిం ఓటర్లు ఉన్నారు. అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ముస్లింల మద్దతు కూడగట్టాలనే వ్యూహాత్మక ఆలోచన ఉంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి అజారుద్దీన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఇక అజారుద్దీన్ కు మంత్రి పదవి వెనుక ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అజారుద్దీన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదన ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. గవర్నర్ ఆమోదం తెలిపితేనే అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేయగలుగుతారు. అయినప్పటికీ, ఎమ్మెల్సీ కాకముందే ఆయన రేవంత్ రెడ్డి కేబినెట్లో చేరుతున్నారు. చట్ట ప్రకారం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఆరు నెలల లోపు తప్పనిసరిగా శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యత్వం పొందాలి. ఇదిలా ఉండగా, ఉపఎన్నిక నేపథ్యంలో టికెట్ ఆశించిన అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా ప్రతిపాదించి, జూబ్లీహిల్స్ టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం నవీన్ యాదవ్‌కు కేటాయించింది.
మంగళవారం సాయంత్రం అజారుద్దీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వీరి సమావేశం అనంతరమే మంత్రి పదవికి సంబంధించిన నిర్ణయం వెలువడింది. అజారుద్దీన్ చేరిక తర్వాత కూడా సీఎం రేవంత్ కేబినెట్లో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉండనున్నాయి. మొత్తం మీద, అజారుద్దీన్‌కు మంత్రి పదవి కల్పించడం ద్వారా ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించడం, ఉపఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరుచుకోవడం అనే వ్యూహాలు దాగి ఉన్నాయి.







