Assam Congress: కాంగ్రెస్ సభలో బంగ్లా జాతీయ గీతాలాపన..? అసోంలో దుమారం..!!
అసోంలోని (Assam) సరిహద్దు జిల్లా కరీంగంజ్‌లో (Karimgunj) జరిగిన ఒక సంఘటన ఆ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర కలకలం రేపింది. కాంగ్రెస్ (Congress) పార్టీ సమావేశంలో ఆ పార్టీ నాయకుడు బిదు భూషణ్ దాస్ (Bidu Bhushan Das) ఆలపించిన పాటపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైంది. అది బంగ్లాదేశ్ జాతీయ గీతం ‘ఆమార్ సోనార్ బంగ్లా’ (Amar Sonar Bangla) అని బీజేపీ (BJP) ఆరోపిస్తోంది. అయితే అది కూడా రవీంద్రనాథ్ గేయమేనని కాంగ్రెస్ తిప్పికొడుతోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని మంత్రి ప్రకటించడంతో వివాదం మరింత పెద్దదైంది.
కరీంగంజ్ జిల్లాను ప్రస్తుతం శ్రీభూమి జిల్లాగా పిలుస్తున్నారు. ఇక్కడ స్థానిక కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా భవన్ లో జరిగిన కాంగ్రెస్ సేవాదళ్ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీనియర్ కాంగ్రెస్ నేత బిదు భూషణ్ దాస్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ‘ఆమార్ సోనార్ బంగ్లా, ఆమి తోమాయ్ భలోబాసి’ అనే గీతాన్ని ఆలపించారు. ఈ గీతాన్ని నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 1905లో బెంగాల్ విభజన సమయంలో రచించారు. ఈ పాటనే తర్వాత బంగ్లాదేశ్ తన జాతీయ గీతంగా స్వీకరించింది. సరిహద్దు రాష్ట్రమైన అసోంలో, ముఖ్యంగా బెంగాలీ మాట్లాడే ప్రజలు అధికంగా ఉండే బరాక్ లోయలోని కరీంగంజ్ వంటి సున్నితమైన ప్రాంతంలో ఈ పాట ఆలపించడం తీవ్ర వివాదానికి దారితీసింది.
అసోంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ నేత ఆలపించిన గీతం బంగ్లాదేశ్ జాతీయ గీతమేనని ఆరోపించింది. బంగ్లా చొరబాటుదారులపై కాంగ్రెస్ ప్రేమకు ఇది నిదర్శనం అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది. రాష్ట్ర జనాభా స్వరూపాన్ని మార్చేసి, గ్రేటర్ బంగ్లాదేశ్ ఎజెండాను సులభతరం చేయాలని చూస్తోందని తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ నాయకుడి గీతాలాపనపై తనకు నివేదిక అందిందని, ఏది, ఎప్పుడు పాడాలో కూడా వారికి తెలియదని మంత్రి కృష్ణేందు పాల్ విమర్శించారు. ఈ సంఘటనపై సాక్ష్యాధారాలు సేకరించి పోలీసు విచారణ జరిపిస్తామని మంత్రి ప్రకటించారు.
అయితే.. కాంగ్రెస్ నాయకులు ఈ వివాదాన్ని ఖండించారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని కొట్టిపారేశారు. బిదు భూషణ్ దాస్ ఆలపించింది కేవలం రవీంద్ర సంగీతం మాత్రమేనని జిల్లా కాంగ్రెస్ కమిటీ మీడియా విభాగం చైర్పర్సన్ షాహదత్ అహ్మద్ చౌధురి స్పష్టం చేశారు. ఆయన తమ ప్రసంగాన్ని రవీంద్ర సంగీతంతో ప్రారంభిస్తున్నట్లు ముందే చెప్పారని పేర్కొన్నారు. దాస్ గౌరవనీయమైన నాయకుడని, ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఇందిరా భవన్లో జాతీయ జెండాను ఎగురవేస్తారని వివరించారు. ఆయన బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఆలపించే ప్రశ్నే లేదని చౌధురి స్పష్టం చేశారు. ఈ గీతాలాపన కేవలం మాతృభాష బెంగాలీపై ఉన్న ప్రేమకు నిదర్శమని కాంగ్రెస్ వాదిస్తోంది.
కరీంగంజ్ జిల్లా బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉండడం, అక్రమ వలసలు, జనాభా మార్పు వంటి అంశాలు అసోం రాజకీయాల్లో ఎప్పుడూ ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటున్నాయి. ఇప్పుడు ఈ చిన్న సంఘటన కూడా పెద్ద రాజకీయ దుమారంగా మారింది. బెంగాలీ మాట్లాడే జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో, ఈ గీతాలాపనపై బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి ప్రకటించడంతో, సరిహద్దు ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది.







