Montha Cyclone: మొంథా తుఫాన్ దూకుడుకు కళ్లెం వేసిందెవరు…?
ఆంధ్రావాసులకు మూడురోజుల పాటు నిద్రాహారాలు లేకుండా తీవ్ర భయాందోళనలకు గురిచేసిన మొంథా తుఫాన్ (Montha Cyclone).. ఎట్టకేలకు ఉగ్రరూపాన్ని వీడింది. నరసాపురం సమీపంలో అర్ధరాత్రి గం. 1:00 సమయంలో తీరాన్ని తాకినప్పటికీ, అంచనా వేసిన స్థాయిలో విధ్వంసం జరగకపోవడంతో ప్రజలు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నా, తుపాను కారణంగా వాయు, రైలు రవాణా సేవలు స్తంభించాయి.
ఇంతకూ మొంథా తుఫాన్ దూకుడు తగ్గడానికి కారణాలేంటి..?
వాస్తవానికి సముద్రంలో తీవ్ర తుపానుగా ఉన్నప్పుడు ఇది 2023లో వచ్చిన మిచాంగ్ తుపానును తలపించింది. తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, తీరానికి 70-100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ‘విండ్ షీర్’ (గాలుల కోత) ప్రభావానికి గురైంది. ఇది తుపాను కన్ను (సైక్లోన్ ఐ) భాగాన్ని దెబ్బతీయడంతో, గాలులు చెల్లాచెదురై తుపాను తన శక్తిని కోల్పోయింది. దీంతో తీరం దాటే సమయానికి గంటకు 70-80 కి.మీ. వేగంతో గాలులు వీచి, మోస్తరు వర్షాలకే పరిమితమైంది.
తీరం చేరకముందు కోనసీమలో అలజడి
తీరం దాటకముందు మొంథా తన ప్రభావాన్ని కోనసీమ జిల్లాపై చూపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బలమైన ఈదురు గాలులకు అనేక కొబ్బరి చెట్లు, భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సముద్రపు అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడి, దాదాపు 300 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకురావడంతో తీర ప్రాంతం కోతకు గురైంది. అయితే, రాత్రి 8 గంటల తర్వాత వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ప్రచండ గాలులు నిలిచిపోయి, భారీ వర్షం తగ్గుముఖం పట్టింది. మొత్తంమీద, భారీ విధ్వంసం సృష్టిస్తుందని భావించిన మోంథా తుపాను, స్వల్ప ప్రభావంతో గట్టెక్కింది.







