Smartphone Exports: రికార్డు స్థాయిలో భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు
సెప్టెంబర్ నెలలో భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు (Smartphone Exports) సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఈ నెలలో ఎగుమతుల విలువ ఏకంగా 1.8 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15.88 వేల కోట్లకు) చేరింది. ఇది గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 100 శాతం ఎక్కువ. గత మూడేళ్లలో ఈ స్థాయిలో పెరుగుదల కనిపించలేదని వాణిజ్య శాఖ తెలిపింది. ఈ అద్భుతమైన వృద్ధికి కారణం 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (PLI) పథకమేనని విశ్లేషకులు అంటున్నారు. వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరపు ప్రథమార్థంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు (Smartphone Exports) 60 శాతం పెరిగి రూ. 1.19 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల విలువ రూ. 74.1 వేల కోట్లుగా నమోదైంది. మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో ఒక్క యాపిల్ (Apple) ఫోన్ల వాటానే రూ. 88.25 వేల కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఇది మొత్తం ఎగుమతి విలువలో దాదాపు 75 శాతం.







