Donald Trump: మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ట్రంప్!
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. మూడోసారి కూడా అధ్యక్ష బరిలో నిలబడటానికి సిద్ధంగా ఉన్నానని పరోక్షంగా సూచించారు. మలేషియా నుండి టోక్యోకు ప్రయాణిస్తున్న సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ (Air Force One)లో మీడియాతో ఆయన మాట్లాడారు. 2028 ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. “ఉపాధ్యక్షుడిగా గెలిచి, తర్వాత అధ్యక్షుడు రాజీనామా చేస్తే నేను అధ్యక్షుడిని కావొచ్చు. ఆ ఆలోచన ‘క్యూట్’గా ఉన్నా, అలా చేయడం సరికాదు, ప్రజలు ఇష్టపడరు” అని ట్రంప్ (Donald Trump) అన్నారు.
అయితే మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేయడానికి ‘వేరే మార్గాలు’ ఉన్నాయని ఆయన చెప్పినప్పటికీ, ఆ మార్గాలు ఏంటో మాత్రం వెల్లడించలేదు. ఇటీవల ట్రంప్ ఉపాధ్యక్ష బరిలో ఉంటారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన (Donald Trump) ఈ విధంగా స్పందించారు. కాగా, అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం, ఏ వ్యక్తి కూడా రెండుసార్లకు మించి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి వీల్లేదు. ఈ సవరణను మార్చాలంటే సెనేట్లో మూడింట రెండు వంతుల మంది ఆమోదం అవసరం. ఈ ప్రక్రియ దాదాపు అసాధ్యమని విశ్లేషకుల అభిప్రాయం.







