US voting system: ఓటర్ ఐడీకి ట్రంప్ జై… భారత్ బాటలో అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తమ దేశ పాలన విధానాల్లో పలు మార్పులు తెస్తున్నారు. వాటిలో భాగంగా ఇతర దేశాలపై ట్రేడ్ వార్ కూడా ప్రకటించారు. అయితే ఇతర అంశాలపైనా ట్రంప్ ఫోకస్ పెట్టారు.మరీ ముఖ్యంగా తమ దేశంలోని ఓటింగ్ వ్యవస్థ, లెక్కింపు.. ఈసీ సహా చాలా అంశాల్లో సంస్కరణలు రావాల్సి ఉందన్నది ట్రంప్ అభిప్రాయం. ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించారు కూడా.
భారత్(india)తోపాటు బ్రెజిల్(Brazil)లోనూ ఓటర్ల నిర్వహణ వ్యవస్థలు బాగున్నాయని, రెండు దేశాలు.. ఓటర్ల గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్‌తో అనుసంధానం చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. అదే అమెరికా స్వీయ ధ్రువీకరణతో సరిపెడుతోందన్నారు. అమెరికా ఎన్నికల వ్యవస్థలో పూర్తి స్థాయి సంస్కరణలను తీసుకొస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) మంగళవారం ట్రంప్ సంతకం చేశారు.
ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లోని ఎన్నికల వ్యవస్థలను ప్రస్తావించారు. ‘మనం స్వయం పాలనలో ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం. కానీ అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో అమలు చేస్తున్న ప్రాథమికమైన, అవసరమైన ఎన్నికల రక్షణ విధానాలను పాటించడంలో విఫలమయ్యాం. ఉదాహరణకు భారత్, బ్రెజిల్‌లు ఓటర్ల గుర్తింపు కార్డులను బయోమెట్రిక్‌తో అనుసంధానం చేస్తున్నాయి. జర్మనీ, కెనడా పేపర్ బ్యాలెట్లను వినియోగిస్తున్నాయి. వాటిని అధికారుల సమక్షంలో బహిరంగంగా లెక్కిస్తున్నాయి. ఫలితంగా వివాదాలు తలెత్తడం లేదు. అదే అమెరికాలో ఓటింగ్ విధానాలు అనేక వివాదాలను సృష్టిస్తున్నాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఓటేయాలంటే పౌరసత్వ గుర్తింపు చూపాలి
ఇప్పటిదాకా స్వీయ ధ్రువీకరణతో అమెరికాలో ఓటేయడానికి అవకాశముండేది. ట్రంప్ నిర్ణయంతో ఇక నుంచీ జాతీయ ఎన్నికల్లో పౌరసత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపాల్సిందే. అమెరికా పాస్‌పోర్టుగానీ, జనన ధ్రువీకరణ పత్రాన్నిగానీ రుజువుగా చూపించాలి. అంతేకాకుండా పోలింగ్ తేదీ నాటికి బ్యాలెట్లన్నీ లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాల్సిందే. ఇక నుంచీ ఫెడరల్ ఏజెన్సీలు రాష్ట్రాలతో ఓటర్ల జాబితాలను పంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల నేరాల్లో ప్రాసిక్యూట్ చేస్తారు.