Lokam Family: వివాదాల్లో జనసేన ఎమ్మెల్యే..!?

విజయనగరం జిల్లా నెల్లిమర్ల (Nellimarla) నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే (Janasena) లోకం నాగ మాధవి (MLA Lokam Madhavi) కుటుంబం చుట్టూ రాజకీయ వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకవైపు ఆమె గ్రామ పంచాయతీకి రూ.24 లక్షల ఆస్తి పన్ను బకాయిపడడంతో సర్పంచ్ ఆమెను ప్రశ్నించారు. ఆ పన్ను కడితే గ్రామ అభివృద్ధికి ఖర్చు పెడతానన్నారు. ఇది వైరల్ అవుతోంది. తాజాగా ఆమె భర్త లోకం ప్రసాద్ అధికార కార్యక్రమాల్లో పెత్తనం సాగిస్తున్నారంటూ వీడియోలు, ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో లోకం మాధవి కుటుంబం వార్తల్లో నిలుస్తోంది.
నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం మండల సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే లోకం మాధవిని ముంజేరు గ్రామ సర్పంచ్ పూడి నూకరాజు ఆస్తి పన్ను కట్టాలని నిలదీశారు. మీ పన్ను బకాయి రూ.24 లక్షలు ఉందని, దాన్ని చెల్లిస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన చెప్పారు. మీరు పన్ను చెల్లించకపోతే అభివృద్ధి పనులు ఆలస్యమవుతాయని కూడా అన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యేలు నిలదీసిన సర్పంచ్ అని పలువురు పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఎమ్మెల్యే ఇంటి పన్ను రూ.24 లక్షలా అని ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యేగా ఉండి పన్ను కట్టకపోవడమేంటని మరికొందరు నిలదీస్తున్నారు.
మరోవైపు లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ చర్యలు కూడా విమర్శలకు గురవుతున్నాయి. మాధవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత, ప్రసాద్ అధికారిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. “ఆయనో ఎమ్మెల్యే భర్త.. కానీ ఓ ప్రజాప్రతినిధిలా వ్యవహరిస్తారు.. అవసరమైతే అధికారిలా మారిపోయి.. క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రశ్నిస్తారు.. అదీ కుదరకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తారు.. ఎమ్మెల్యేలా ప్రశ్నిస్తారు.” అని తాజాగా ఓ పత్రిక ప్రసాద్ పై ఓ కథనం రాసింది. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రసాద్ అధికారిక కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే భర్త కావడంతో అధికారులు కూడా కిమ్మనకుండా ఉండిపోతున్నారు. లోకం ప్రసాద్ తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే భర్త అయినంత మాత్రాన రుబాబు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
లోకం మాధవి రిచ్చెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా ఆ కుటుంబ వివాదాలు జనసేన పార్టీకి తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలని, పారదర్శకంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పదే పదే సూచిస్తున్నారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడంతో జనసేన పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.