Moscow: మరోసారి మాస్కోకు ట్రంప్ ప్రతినిధి!

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ (Steve Witkoff) మాస్కో (Moscow)కు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin)తో భేటీ అయ్యే అవకాశం ఉంది. దీనిని ఇప్పటి వరకు క్రెమ్లిన్ వర్గాలు ధ్రువీకరించలేదు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ (Sergei Lavrov) స్పందిస్తూ యుద్దానికి ముగింపు పలికేలా అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి మాస్కో సిద్ధంగా ఉందని ప్రకటించారు. కొన్ని అంశాలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు సరైన మార్గంలో ఆలోచించడం వల్లే ప్రస్తుతం సవ్య దిశలో ప్రయాణిస్తున్నామన్నారు. యుద్ధానికి పరిష్కారం కోసం ఇప్పటికే విట్కాఫ్ మూడు సార్లు మాస్కోను సందర్శించారు. ఫిబ్రవరి 11, మార్చి 13, ఏప్రిల్ 11న ఆయన పుతిన్‌తో మాట్లాడారు. ఈ చర్చల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగతి కనిపిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు.