Donald Trump: వాహన టారిఫ్‌లకు ట్రంప్ ఊరట

వాహనాలు, వాహన విడిభాగాలపై 25 శాతం టారిఫ్ ప్రభావం నుంచి స్వల్ప ఊరటను ఇస్తూ అధికారిక ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకాలు చేశారు. టారిఫ్ (Tariff)ల వల్ల వాహన ధరలు పెరగడం, విక్రయాలు తగ్గడంతో పాటు ప్రపంచ విపణుల్లో అమెరికా ఉత్పత్తుల పోటీ సామర్థ్యంపై ప్రభావం పడొచ్చంటూ వాహన కంపెనీలు (Automotive companies) , విశ్లేషకులు (analysts) సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో పై పరిణామం చోటుచేసుకుంది.
అమెరికాకు దిగుమతయ్యే వాహనాలకు 25 శాతం టారిఫ్‌లు కొనసాగుతాయి. అయితే విదేశీ విడిభాగాలతో అమెరికాలో అసెంబ్లింగ్ ప్రక్రియనున పూర్తి చేసుకున్న వాహనాలు రెండేళ్ల పాటు పాక్షిక రీఎంబర్స్‌మెంట్ (Reimbursement) కు అర్హత సాధిస్తాయి. 2026 మే 1లోపు అమెరికాలో తయారైన కార్ల విలువ లో 3.75 శాతానికి సమానమైన రీఎంబర్స్‌మెంట్ లభిస్తుంది. ఆ తర్వాత నుంచి 2027 ఏప్రిల్ 30 వరకు తయారయ్యే కార్లకు ఈ రిబేట్ పరిమితి కారు విలువలో 2.5 శాతంగా ఉండనుంది. తొలి ఏడాదిలో అమెరికాలో అసెంబ్లింగ్ అయిన కారు విలువలో 15 శాతానికి, రెండో ఏడాదిలో కారు విలువలో 10 శాతానికి 25 శాతాన్ని సుంకాన్ని వర్తింపచేయడం ద్వారా పై రీఎంబర్స్‌మెంట్స్ పరిమితులను లెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మార్పులు అమెరికాలో మరింత తయారీని పెంచేలా వాహన కంపెనీలు ముందుకు వచ్చేందుకు ఒక వారధిగా పనిచేస్తాయని ట్రంప్ తెలిపారు.