Health Department : అమెరికా ఆరోగ్య శాఖ పై కొరడా.. 10వేల ఉద్యోగులను!
అమెరికాలోని వైద్య సేవల రంగంలో పని చేసే 82,000 మంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తొలగించే 10,000 మందిలో తాము ఉంటామేమోననే భయంతో వారంతా ఈ-మెయిళ్లు చూస్తూ కూర్చున్నారు. మరికొంత మంది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (Food and Drug Administration) ఉద్యోగులు తమ ల్యాప్టాప్లను సర్దే పనిలో నిమగ్నమయ్యారు. ఏ క్షణమైనా పింక్ స్లిప్లు (Pink slips) మెయిల్లో వస్తాయనే ఆందోళన వారిలో ఉంది. ఆ ఆందోళన మంగళవారం నుంచీ నిజమైంది. ఉద్యోగులను తొలగిస్తూ ఈ-మెయిళ్లను పంపడం ఆరోగ్యశాఖ ప్రారంభించింది. జాతీయ అరోగ్య సంస్థ డైరెక్టర్గా భట్టాచార్య (Bhattacharya ) బాధ్యతలు చేపట్టిన వెంటనే నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. వైద్య, మానవ సేవల విభాగాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నామని మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ (Robert F. Kennedy Jr.) గతవారం ప్రకటించారు. దీనివల్ల 20 వేల మంది ఉద్యోగులు తగ్గిపోతారని తెలిపారు. ఇందులో 10,000 మందికి ఉద్వాసన పలుకుతున్నామని, మరో 10,000 మంది పదవీ విరమణ చేస్తున్నారని వెల్లడిరచారు. ఈ శాఖలో ఏటా 1.7 ట్రిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అమెరికా విఫలమవుతోందని వ్యాఖ్యానించారు.






