Donald Trump : ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో నిరసన

ప్రజాస్యామ్యాన్ని రక్షించాలని, వలసదారుల హక్కులను కాపాడాలని కోరుతూ అమెరికాలోని ఊరువాడా రోడ్డెక్కింది. వలసదారులను అరెస్టు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదేశించడాన్ని నిరసిస్తూ లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. వీధులు, పార్కులు, ప్లాజాలు జన నినాదాలతో హోరెత్తాయి. డౌన్‌టౌన్‌లు, చిన్న పట్టణాలు ప్రదర్శనలతో కిక్కిరిశాయి. వందల నిరసన కార్యక్రమాల్లో లక్షల మంది పాల్గొన్నారని నిరసనకారులు తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని పలు రాష్ట్రాల గవర్నర్లు పిలుపునిచ్చారు. కొంత మంది గవర్నర్లు నేషనల్ గార్డుల కవాతుకు ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ (Washington)లోని సైనిక పరేడ్‌కు హాజరయ్యారు. శనివారం ట్రంప్ పుట్టినరోజు. దీంతోపాటు సైన్యం 250వ వార్షికోత్సవం కావడం విశేషం. లాస్ ఏంజెలెస్ (Los Angeles )లో గత వారం వలస సేవలు, సుంకాలు అమలు విభాగం ( ఐస్) అధికారులు వలసదారులను అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అవి దేశమంతటా విస్తరించాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని జనమంతా ఒక్కటై అమెరికా (America) కోసం శాంతియుతంగా నిలిచారని, తమకు రాజులు అవసరం లేదని నో కింగ్స్ కమిటీ (No Kings Committee) ఒక ప్రకటనలో వెల్లడిరచింది.