క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి…
ఆరు దశాబ్దాలుగా క్యూబాపై అమెరికా కొనసాగిస్తున్న ఆర్థిక, వాణిజ్య ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలని ఆఫ్రికన్, కరేబియన్, పసిఫిక్ దేశాల సమాఖ్య మంత్రుల కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఈ ఆంక్షలు క్యూబస్ సమాజంపై వినాశకర ప్రభావాలు చూపుతున్నాయని బెల్జియంలో క్యూబా రాయబారి, యూరోపియన్ యూనియన్ మిషన్ హెడ్ నోర్మా ఎసైనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శితో సహా పలువురు ప్రముఖులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, క్యూబాను రాజకీయంగా అస్థిరపరచాలనే లక్ష్యంతో కోవిడ్ సంక్షోభ సమయంలో సైతం అమెరికా ఆంక్షలను ఉధృతం చేసిందని ఆమె విమర్శించారు.
అమెరికా దుర్మార్గాన్ని ఖండిస్తూ ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. జూన్ 23న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి మద్దతును పునరుద్ఘాటించింది. నేరపూరితమైన ఈ ఆంక్షల విధానం వల్ల క్యూబన్లకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఆంక్షలతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కోవిడ్ సంక్షోభ సమయంలో ఇతర దేశాలకు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించిందని అన్నారు.






