Amaravati: అమరావతికి కేంద్రం రక్షణ..! చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్..!!
* దశాబ్ద కాలపు అనిశ్చితికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు.
* రాష్ట్ర ప్రభుత్వాల మారినప్పుడల్లా రాజధాని మారకుండా పార్లమెంట్ చట్టం.
* దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా అమరావతికి చట్టబద్ధత.
* ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ వ్యూహాత్మక ఎత్తుగడ.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా రాజధాని ఎక్కడ? అన్న ప్రశ్నకు ఇప్పటికీ పూర్తి స్థాయి భరోసా దక్కని పరిస్థితి. అయితే, ఈ దశాబ్ద కాలపు గందరగోళానికి, రాజకీయ అనిశ్చితికి శాశ్వత ముగింపు పలకాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాలపై ఆధారపడకుండా, ఏకంగా భారత పార్లమెంట్ ద్వారానే అమరావతికి (Amaravati) చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధమైంది. ఇది అమల్లోకి వస్తే, భారతదేశ చరిత్రలోనే పార్లమెంట్ చట్టం ద్వారా రక్షణ పొందిన ఏకైక రాజధానిగా అమరావతి రికార్డు సృష్టించనుంది.
వాస్తవానికి రాజధాని ఎంపిక అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి, సింగపూర్ సహకారంతో పనులు ప్రారంభించింది. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అమరావతికి భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు వెనుదిరిగారు. కోర్టులు జోక్యం చేసుకుని మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నప్పటికీ, “భవిష్యత్తులో మళ్లీ ప్రభుత్వం మారితే రాజధాని మారుతుందేమో?” అన్న భయం ప్రజల్లో, పెట్టుబడిదారుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ గందరగోళానికి చెక్ పెట్టాలంటే రాష్ట్ర చట్టాలు సరిపోవని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, తర్వాతి ప్రభుత్వం మార్చే అధికారం కలిగి ఉంటుంది. జగన్ హయాంలో జరిగింది ఇదే. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అమరావతిని అభివృద్ధి చేసినా, భవిష్యత్తులో వచ్చే వేరే ప్రభుత్వం దానిని మళ్లీ మార్చదని గ్యారెంటీ లేదు. అందుకే ఈ సమస్యకు ‘పొలిటికల్ సొల్యూషన్’ కాకుండా ‘లీగల్ సొల్యూషన్’ వెతుకుతున్నారు. దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో సవరణలు చేయడం ద్వారా అమరావతిని ఏకైక రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఒకసారి పార్లమెంట్ ద్వారా చట్టం చేస్తే, భవిష్యత్తులో ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, అసెంబ్లీలో మెజారిటీ ఉన్నా రాజధానిని మార్చడం సాధ్యం కాదు. అలా మార్చాలంటే మళ్లీ పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి అవుతుంది. ఇది అమరావతికి శాశ్వతమైన రక్షణ కవచంలా మారుతుంది.
భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర రాజధానికి ఇలాంటి చట్టబద్ధత లేదు. కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాజధానిని నిర్ణయిస్తారు తప్ప, దానిని చట్టంలో పొందుపరచరు. కానీ ఏపీలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, రైతుల త్యాగాలు, రాజకీయ కక్షసాధింపు చర్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి. అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు తన చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. కేంద్రం కూడా దీనికి సానుకూలంగా ఉండటంతో, అమరావతికి ఇక తిరుగులేదని భావించవచ్చు. ఈ చట్టం వస్తే కేవలం అమరావతికే కాదు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌కి ఒక భరోసా కలుగుతుంది.






