TTD Parakamani Case: రోజుకో కొత్త ట్విస్ట్ తో వీడని చిక్కుముడిలా సాగుతున్న పరకామణి కేసు..
తిరుపతి (Tirupati) పరకామణి కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మళ్లీ కుదిపేస్తోంది. సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టిలోకి రావడంతో మళ్లీ చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారి అనుమానాస్పద మరణం, గత ప్రభుత్వంలో కేసు వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు ఇప్పుడు ఎన్నో సందేహాలకు దారితీస్తున్నాయి. దర్యాప్తు సాగుతున్న కొద్దీ కొత్త కోణాలు బయటపడుతున్నాయి.
మొదట్లో ఈ కేసు వైయస్సార్ కాంగ్రెస్ (YSR Congress) పాలనలో పరకామణిలో చోరీ ఘటనగా వెలుగులోకొచ్చింది. అక్కడ పనిచేసిన రవికుమార్ (Ravi Kumar) అనే ఉద్యోగిపై విదేశీ కరెన్సీ దొంగతనం ఆరోపణలు వచ్చాయి. ఆయనకు తక్కువ కాలంలోనే అనూహ్యంగా పెరిగిన ఆస్తులపై అప్పట్లోనే అనేక అనుమానాలు వినిపించేవి. ఇదే సమయంలో టీటీడీ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సతీష్ కుమార్ (Sathish Kumar) రవికుమార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం పెద్ద సంచలనమే అయ్యింది. వెంటనే ఆయనను తిరుపతి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించి కేసు నమోదు చేశారు.
కానీ ఆశ్చర్యకరంగా కొద్ది రోజులకే సతీష్ కుమార్ కేసును వెనక్కి తీసుకోవడం, లోక్ అదాలత్‌లో (Lok Adalat) రాజీ చేసుకోవడం అప్పట్లోనే అనుమానాలు రేకెత్తించింది. టీటీడీ పెద్దల ఆదేశం లేకుండా ఒక విజిలెన్స్ అధికారి ఇలాంటి కీలక కేసులో రాజీకి ఎందుకు ఒప్పుకున్నారు? ఎవరి ఒత్తిడికి లోనయ్యారు? ఇవన్నీ ఇప్పుడు పరిశీలనలో ఉన్న ప్రధాన ప్రశ్నలు. అంతేకాకుండా రవికుమార్ వద్ద పెద్ద ఎత్తున ఆస్తులు కొంత టీటీడీకి, మిగతా భాగం అప్పటి అధికార నాయకులకు బదలాయించబడిందని వచ్చిన ఆరోపణలు కూడా మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పునఃపరిశీలన చేస్తుండగా, సిట్ సతీష్ కుమార్‌ను విచారించేందుకు పిలిపించిన కొద్దిరోజులకే ఆయన మరణం కేసుకు కొత్త మలుపు తీసుకొచ్చింది. పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాత్రం ఇది ఆత్మహత్యేనని ప్రకటించడం, ఈ ప్రకటనకే సిట్ నోటీసులు ఇవ్వడం మరో కొత్త కోణం తెరపైకి తీసుకొచ్చాయి.
అదే సమయంలో మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి (YV Subba Reddy) కూడా సిట్ విచారణకు హాజరు కావాల్సి రావడం ఈ కేసు రాజకీయంగా ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో చూపుతోంది. ఒకేసారి ఇద్దరు ప్రధాన నేతలకు విచారణ నోటీసులు ఇవ్వడం వల్ల ఈ వ్యవహారం ఇంకా పెద్దది అవుతోంది. ఇంతకుముందు నిశ్శబ్దంగా ముగిసిపోయినట్లనిపించిన ఈ పరకామణి కేసు, ఇప్పుడు భారీ రాజకీయ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల ముందు ముందు దర్యాప్తులో కొత్త విషయాలు బయటపడతాయనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.






