Jagan: అభిమానం పేరిట అల్లర్లు: వైసీపీ శ్రేణుల అదుపు తప్పిన హంగామా..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) కు ఉన్న అభిమాన జనం గురించి ఎవరూ సందేహపడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆయన ఛాన్స్ ఎవరికీ ఇవ్వరు. జగన్ పర్యటన చేసిన ప్రతిసారి అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.కానీ ఆ అభిమానం నియంత్రణ కోల్పోతే ఏలాంటి సమస్యలు వస్తాయో, తాజాగా పులివెందుల (Pulivendula) లో జరిగిన ఒక ఘటన మరోసారి గుర్తు చేసింది. నాయకుడిపై ప్రేమ చూపించడంలో తప్పులేదు, కానీ అది నాయకుడికే ఇబ్బంది కలిగించే స్థాయికి వెళ్లినప్పుడు.. ఆలోచించాల్సిందే.
జగన్ కుటుంబం బెంగళూరులోనే (Bengaluru) ఎక్కువ సమయం గడుపుతూ..అప్పుడప్పుడు తాడేపల్లి (Thadepalli ) కి, పులివెందులకు వస్తుండటం తెలిసిందే. ఈసారి ఆయన మూడు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో ప్రజాదర్బార్ (Praja Darbar)నిర్వహించారు. అభిమానులు ఆయనను చూడాలని, తమ సమస్యలను చెప్పాలని ఎంతో ఉత్సాహంతో క్యాంప్ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. అయితే ఈ ఉత్సాహం అక్కడ నియంత్రణ తప్పినట్లుగా మారింది. నాయకుడిని స్పర్శించాలనే, ఒక్కసారి కనీసం ఆయనను దగ్గరగా చూడాలనే తపనతో వారు ఒకేసారి ముందుకు రావడంతో భారీ తోపులాట చోటుచేసుకుంది.
ఈ తొక్కిసలాటలో క్యాంప్ కార్యాలయం కిటికీల అద్దాలే పగిలిపోవడం పరిస్థితి ఎక్కడికి చేరిందో స్పష్టం చేసింది. ఇది అభిమానుల ప్రేమ కాదు, బాధ్యతలేమి అని చెప్పాల్సి వస్తోంది. నాయకుడిని రక్షించాల్సిన ప్రజలే ఇలా ప్రవర్తిస్తే, పార్టీ ప్రతిష్టపైనే చెడు ప్రభావం పడకమానదు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ మురళీ నాయర్ (DSP Murali Nair) తక్షణమే జోక్యం చేసుకుని ప్రజలను చెదరగొట్టాల్సి రావడం పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో సూచిస్తుంది.
జగన్ ప్రజాదర్బార్‌లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy), ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేశ్ యాద్, ఎమ్మెల్యే సుధ, ఆకేపాటి అమర్నాథ రెడ్డి వంటి నేతలూ ఉన్నారు. వారి సమక్షంలో జరిగిన ఈ కలకలం వైసీపీ శ్రేణుల వ్యవహారశైలిపై పెద్ద ప్రశ్నల్ని లేవనెత్తింది. పబ్లిక్ ఈవెంట్స్‌లో నాయకుడిని కాపాడాల్సింది అభిమానులే, కాని ఆయన భద్రతకే ప్రమాదంగా మారేంత ప్రవర్తన చూపడం ఎంతవరకు సముచితం?
జగన్‌కు ఉండే ప్రజాదరణను ఎవరూ ప్రశ్నించలేరు. కానీ ఆ అభిమానమే నాయకుడికి ఇబ్బంది కలిగించే పరిస్థితి సృష్టిస్తే, అది తప్పకుండా ఖండించాల్సిన విషయమే. క్రమశిక్షణ లేకుండా వ్యవహరించడం పార్టీకి మైనస్ మాత్రమే. అభిమానం ఒక పరిమితిలో ఉంటేనే అందంగా ఉంటుంది. రాజకీయాల్లో నాయకుడి భద్రత అత్యంత ముఖ్యమైనది. అభిమానులు తమ ప్రేమను చూపించడంలో అతిగా ప్రవర్తిస్తే, దాంతో సమస్యలు వస్తాయి, అవి మొదట విమర్శలు రూపంలో, తర్వాత పార్టీ ప్రతిష్ట తగ్గేలా మారవచ్చు. ఇలాంటి పరిస్థితులను నివారించడానికి వైసీపీ శ్రేణులు తమ ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించాలి. నాయకుడి ఇమేజ్‌కి నష్టం కలిగించే చర్యలను ఆపాలి. అభిమానమేనన్నా, నాయకుడి భద్రతను దెబ్బతీయడం ఎప్పటికీ సమర్థించలేనిది. పైగా జగన్ సభలకు వచ్చే జనం..వారు చేసే హంగామా పై ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి..ఈ విషయాలపై అదుపు తీసుకురాకపోతే భవిష్యత్తులో జగన్ కు ఓపెన్ మీటింగ్స్ పర్మిషన్ దొరకడమే కష్టం అవ్వచ్చు.






