విధానాల రూపకర్త… అలుపెరుగని యోధుడు అధ్యక్షుడిగా జో బైడెన్
ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. డెలావర్‌కు సుదీర్ఘకాలంగా సెనేటర్‌గా విధులు నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు కావాలన్నది ఆయన కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఐదేండ్లు కాదు.. పదేండ్లు కాదు. ఏకంగా ఐదు దశాబ్దాలుగా ఆయన పోరాడారు. మధ్యలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా.. తోటివారు అవహేళన చేసినా.. కుటుంబసభ్యులను కోల్పోయినా లక్ష్యం నుంచి దృష్టిని మరల్చలేదు. 77 ఏండ్ల వయస్సులో చివరకు తన కలను నిజం చేసుకున్నారు. అధ్యక్షునిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. 1942లో భారత్‌లో క్విట్ ఇండియా ఉద్యమం నడుస్తున్న కాలంలో అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్ ప్రాంతంలో బైడెన్ జన్మించారు. బైడెన్ చిన్నప్పటి నుంచే మొండివాడని ఆయన మిత్రులు చెప్తారు. ‘బైడెన్ ఇది చేస్తావా అని ఛాలెంజ్ చేయకండి. ఎందుకంటే ఛాలెంజ్ చేస్తే ఆయన అది కచ్చితంగా చేస్తాడు’ అని బైడెన్ చిన్ననాటి మిత్రుడు జిమ్మీ కెన్నడీ అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బైడెన్‌కు పదేండ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన తండ్రి టోర్ బైడెన్ తమ మకాంను డెలావర్‌కు మార్చారు. 1966లో బైడెన్ నీలియా హంటర్‌ను వివాహమాడారు. వారికి ముగ్గురు పిల్లలు. డెలావర్‌లోనే బైడెన్ రాజకీయ జీవితం పురుడుపోసుకున్నది.
విధానాల రూపకల్పనలో నేర్పరి
రాజకీయాల్లో రాటుదేలిన బైడెన్ విధానాల రూపకల్పనలో పట్టు సాధించారు. అందుకే అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా బైడెన్‌ను ఉపాధ్యక్షుడిగా నియమించారు. అమెరికా అధ్యక్షుడు కావాలన్న ఆలోచనతోనే బైడెన్ రాజకీయాల్లోకి వచ్చారు.. 1988లో డెమోక్రటిక్ పార్టీ నుంచి నామినేషన్ వేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. 2008లో అధ్యక్ష పీఠం కావాలనుకున్నారు. కానీ పార్టీలో అందరూ ఒబామాకు మద్దతు పలికారు. 2015లో నామినేషన్ కోసం ప్రయత్నించగా సొంత పార్టీలోనే అవమానాలు ఎదుర్కొన్నారు. అందరూ ఆయనను ‘అంకుల్.. అంకుల్ జో’ అంటూ వయసైపోయిందని హేళన చేసేవారు. అన్నీ అవమానాలను భరిస్తూ చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని బైడెన్ సాధించారు.
గాడితప్పిన ఆర్థిక వ్యవస్థ…
ఇమ్మిగ్రేషన్ వివాదాలను అధిగమిస్తారా?
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలతోపాటు అమెరికా కూడా ఇబ్బందులను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి నివారణకోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కొన్ని నెలలుగా ఆర్థికవేత్తలు కోరుతున్నారు. ఎన్నికలకు ముందు భారీ ఆర్థిక ప్యాకేజీకి డెమోక్రాట్లు ప్రతిపాదించినప్పటికీ ట్రంప్ ఒత్తిడి కారణంగా రిపబ్లికన్లు తిరస్కరించడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రస్తుతం బైడెన్ అధ్యక్ష పీఠంపై కూర్చుంటున్నందున ప్యాకేజీని ఎంత మేరకు పెంచుతారు..? ఆర్థిక వ్యవస్థకు కరోనా సమయంలో ఎలాంటి ఊతమిస్తారనేది..? చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో ఆదాయ అసమానతలు 50 ఏండ్ల గరిష్టానికి చేరుకున్నాయి. సంపన్నులపై ఎక్కువ ట్యాక్స్ ఉండాలని ఉదారవాదులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రజల్లో కూడా దీనికి మద్దతు ఉందని వివిధ సర్వేల ద్వారా తెలుస్తున్నది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోబైడెన్ 2017లో డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ట్యాక్స్ కట్‌ను వెనక్కి తీసుకుంటామని, కార్పోరేషన్లపై 21 శాతం నుండి 28 శాతానికి పన్నులు పెంచుతామన్నారు.
పన్నులు విధిస్తే వ్యాపారుల నుండి ప్రతి ఘటన ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అధిక పన్ను లు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని ఇప్పటికే ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నందున జోబిడెన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికితోడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక చైనాతో వాణిజ్య యుద్ధం తీవ్రంగా మారింది. ఒక దేశం ఉత్పత్తులపై మరో దేశం టారిఫ్ పెంచుతూ ట్రేడ్ వార్‌కు తెరలేపాయి. దీనిపై జోబైడెన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారో చూడాలి.
ఇమ్మిగ్రేషన్ విషయాల్లో బైడెన్ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. ఇమ్మిగ్రేషన్ విషయంలో ఆయన వైఖరి సానుకూలంగానే ఉంటుందని అంటున్నారు. హెచ్1బీ వీసాలపై భారతీయులు సహా ఇతర దేశాల వారికి సానుకూలంగా నిర్ణయం వెలువరిస్తారని అంతా భావిస్తున్నారు.
కాగా అమెరికాలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సెనేట్ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు మెజార్టీ సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భిన్నమైన కార్యాచరణ చేపట్టడం బైడెన్‌కు సవాల్‌గా మారనున్నది. ట్రంప్ ఇప్పటికే వ్యాక్సిన్ అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. రెండు ప్యాకేజీలను ప్రకటించారు. త్వరలో మరో ప్యాకేజీ కూడా సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. ఈ దశలో కరోనా వైరస్ కట్టడికి బైడెన్ ప్రభుత్వం మరింత ఎక్కువ కష్టించి పనిచేయాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
బిల్ క్లింటన్ రికార్డును సమం చేసిన బైడెన్
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఎలక్టోరల్ ఓట్లు మరింత పెరిగాయి. జార్జియా, ఆరిజోనా రాష్ట్రాల్లో విజయం సాధించడంతో ఆయన స్కోరు 306కు చేరింది. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉండగా ఇప్పటికే 48 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డాయి. చివరగా మిగిలిన జార్జియా, ఆరిజోనా రాష్ట్రాల్లో కూడా ఫలితాలు వెలువడ్డాయి. ఆరిజోనాలో 11 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, జార్జియాలో 16 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ బైడెన్ విజయం సాధించడంతో ఆయన ఆధిక్యం 306కు చేరింది. ఇక జార్జియాలో మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ తర్వాత విజయం సాధించిన డెమొక్రాటిక్ అభ్యర్థిగా బైడెన్ రికార్డుల్లో నిలిచారు. 1992లో జరిగిన అధ్యక్ష ఎన్నిలకల్లో చివరిసారిగా క్లింటన్ గెలుపొందారు.
వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాప్‌గా రాన్ క్లెయిన్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పాలనా అధికారుల నియామకంపై గట్టి కసరత్తు చేస్తున్నారు. చాలా ఏళ్లుగా తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాన్ క్లెయిన్కు అత్యంత శక్తిమంతమైన పదవిని అప్పగించారు. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఆయనను నియమిస్తూ బైడెన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే అత్యంత బాధ్యతాయుతమైన పదవి. అగ్రరాజ్య అధ్యక్షుడు రోజువారీ కార్యక్రమాల్ని చూడాలి. ఆయనను అధ్యక్షుడి గేట్ కీపర్‌గా కూడా పేర్కొంటారు. ప్రభుత్వం ఎదుర్కోబోయే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే ఇతర సిబ్బంది నియామకంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.






