USA: రష్యాతో చమురు డీల్స్ నిలిపివేస్తే.. భారత్ పై సుంకాలు తగ్గుతాయి: అమెరికా

రష్యాతో చమురు డీల్స్ నిలిపివేేసే వరకూ 50 శాతం టారిఫ్ విదిస్తున్నామని అమెరికా చేసిన ప్రకటనలు, హెచ్చరికలు ఫలించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తాము మాత్రం రైతులు, ఇతర వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని భారత ప్రధాని మోడీ స్పష్టం చేశారు కూడా. దీంతో అంతర్జాతీయంగా కూడా అమెరికా తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన ప్రపంచం భారత్ కు సంఘీభావం ప్రకటిస్తోంది. తమ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ట్రంప్ కార్యవర్గంలో అసహనం కనిపిస్తోంది.
రష్యా (Russia) నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై (Inida) ఒత్తిడి తీసుకొచ్చేందుకు సుంకాల మోత మోగిస్తున్న అమెరికా (USA) మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఇండియానే కారణమని వైట్ హౌస్ సలహాదారు పీటర్ నవారో విమర్శించారు. దీనిని ‘మోడీ యుద్ధం’గా అభివర్ణించారు. రాయితీపై భారత్ ముడిచమురు కొనుగోలు చేయడమే మాస్కో దూకుడుకు ఆజ్యం పోసిందని ఆయన విమర్శించారు. భారత్ చర్యల వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తే.. అమెరికా విధిస్తున్న సుంకాలను 25 శాతానికి తగ్గించుకోవచ్చని చెప్పారు.
ఇరుదేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే.. భారత్ కూడా అందుకు సహకరించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు నవారో. ఒకవేళ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును నిలిపివేస్తే.. 25 శాతం సుంకాలను పునరుద్ధరిస్తారా? అని ప్రశ్నించగా.. భారత్ ఆ దిశగా చర్యలు తీసుకున్న తర్వాతి రోజు నుంచే 25శాతం సుంకాలు అమలుచేస్తామని స్పష్టంచేశారు. భారత్ తీరు ఆశ్చర్యంగా ఉందని, ప్రధాని మోడీ లాంటి పరిణతి చెందిన నాయకుడు ఎందుకలా వ్యవహరిస్తున్నారో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యాకు భారత్ పరోక్షంగా సాయం చేస్తోందని పీటర్ ఆరోపించారు. రాయితీపై పెద్ద మొత్తంలో ఇండియా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ మొత్తాన్ని మాస్కో ఉక్రెయిన్‌ను అణిచివేసేందుకు ఉపయోగిస్తోందని విమర్శించారు. పీటర్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కడం ఇదే తొలిసారి కాదు. రష్యా ముడి చమురును శుద్ధి చేస్తూ న్యూఢిల్లీ రిఫైనరీ భారీ లాభాలను ఆర్జించిందని గత వారం నవారో విమర్శించారు. భారత్ అమెరికాకు విక్రయిస్తున్న వస్తువుల ద్వారా వచ్చిన సొమ్మును రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు వినియోగిస్తోందని తద్వారా భారీ లాభాలు ఆర్జిస్తోందని ఆరోపించారు. రష్యా ఆ సొమ్మును ఉక్రెయిన్ వినాశనానికి వాడుతోందని విమర్శించారు.