Washinton: ట్రంప్ పాలనపై వెల్లువెత్తిన నిరసనలు..అమెరికన్లలో నిరాశ, నిస్పృహ..

మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అమెరికన్లను ఆకట్టుకుని.. బంపర్ మెజార్టీతో అధికార పగ్గాలు చేపట్టిన ట్రంప్.. ఇప్పుడు ఆ దేశ ప్రజలకే పెద్ద తలనొప్పిగా మారారు. ఆయన ప్రపంచదేశాలపై విధించిన ప్రతికూల సుంకాలుకాస్తా.. ఇప్పుడు ఆదేశ ప్రజలకే పెనుముప్పులా మారాయి. ఒక్కసారిగా వస్తువుల ధరలు పెరిగిపోయాయి. స్టోర్స్ అన్నీ అమెరికన్లతో రష్ అయిపోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అన్న భయం వారిని వెంటాడుతోంది. మూడు నెలల క్రితం ఎలా ఉండేవాళ్లం.. ఇప్పుడు మన పరిస్థితి ఎందుకిలా తయారైందన్న ఆందోళన వారిని వేధిస్తోంది.
దేశాన్ని అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) నడిపిస్తున్న తీరుపై అమెరికా జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన తీరును నిరసిస్తూ దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. శనివారం న్యూయార్క్ నుంచి అలస్కా దాకా వీధుల్లో జనం పోటెత్తి ‘హ్యాండ్సాఫ్’ (Hands Off) అంటూ నినదించారు. రిపబ్లికన్ల పాలన ప్రారంభమయ్యాక జరిగిన అతి పెద్ద నిరసనగా ఇది నిలిచింది. గతంలోనూ నిరసనలు జరిగినా ఈ సారి జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. పౌర హక్కుల సంఘాలు, కార్మిక యూనియన్లు, స్వలింగ సంపర్క సంస్థలు, న్యాయవాద సంఘాలు, సీనియర్ సిటిజెన్, ఎన్నికల సంస్కరణలు.. తదితర 150 సంఘాల ఆధ్వర్యంలో 50 రాష్ట్రాల్లోని 1,200 ప్రాంతాల్లో చేపట్టిన ఈ ‘హ్యాండ్సాఫ్’ ఆందోళనలకు జనం వెల్లువెత్తారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ప్రభుత్వ సైజు తగ్గింపు, ఆర్థిక వ్యవస్థ, వలస విధానం, మానవ హక్కులపై.. ట్రంప్(Trump), ఎలాన్ మస్క్‌లు అనుసరిస్తున్న విధానాలపై మన్‌హటన్ నుంచి అలస్కా దాకా.. పలు రాష్ట్రాల రాజధానుల్లో వేల మంది ‘హ్యాండ్సాఫ్’ ఆందోళనల్లో పాల్గొన్నారు. పశ్చిమ తీరంలోని సియాటిల్‌లో ఐకానిక్ స్పేస్ నీడిల్‌వద్ద ఆందోళనకారులు ప్లకార్డులతోపాటు ‘దురహంకారంపై పోరాడదాం’ అని నినదించారు.
పోర్ట్‌లాండ్, ఓరేగాన్, లాస్ ఏంజెలెస్‌లలోని వీధుల్లో జనం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
వేల మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక భద్రత కార్యాలయాల మూసివేతపై మండిపడ్డారు. వలసదారులను వెనక్కి పంపడం, ట్రాన్స్‌జెండర్ల హక్కులను లాక్కోవడం, ఆరోగ్య రంగానికి నిధులను తగ్గించడంపై విరుచుకుపడ్డారు.
వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్‌వద్ద జరిగిన ఆందోళనలో స్వలింగ సంపర్కులు పాల్గొన్నారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు హాజరయ్యారు. స్వలింగ సంపర్కుల పట్ల ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మానవ హక్కుల గ్రూప్ అధ్యక్షుడు కెల్లీ రాబిన్సన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘వారి దాడులు రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా జరుగుతున్నాయి. వారు మా పుస్తకాలను బ్యాన్ చేయాలని చూస్తున్నారు. హెచ్‌ఐవీ నిధులకు కోత పెడుతున్నారు. మా వైద్యులను, టీచర్లను, మా జీవితాలను, మా కుటుంబాలను నేరస్థులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం ఇలాంటి అమెరికాను కోరుకోలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. గౌరవం, భద్రత, స్వేచ్ఛ కొంత మందికి కాకుండా అందరికీ లభించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
బోస్టన్‌లో వేల మంది ‘హ్యాండ్సాఫ్ అవర్ డెమోక్రసీ, హ్యాండ్సాఫ్ అవర్ సోషల్ సెక్యూరిటీ’ అని నినదించారు. ప్రభుత్వ చర్యలవల్ల తన పిల్లలతో పాటు ఇతరులు.. భయంతో బతికే ప్రపంచంలో ఉండాలనుకోవడం లేదని ఆందోళనలో పాల్గొన్న మేయర్ మిషెల్లీ వూ స్పష్టం చేశారు. భిన్నత్వం, సమానత్వం దాడులకు గురవుతున్నాయని ఆరోపించారు. ఒహాయోలోని కొలంబస్‌లో వందల మంది ఆందోళనల్లో పాల్గొన్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో జరిగిన ఆందోళనలో భారీగా జనం పాల్గొన్నారు. ట్రంప్ గోల్ఫ్ కోర్స్‌కు దగ్గరలోనే ఈ ఆందోళన కొనసాగింది. మరోవైపు ఈ ఆందోళనలకు మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మద్దతు పలికారు. ట్రంప్ అసమర్థ విధానాలపై వెల్లువెత్తిన ప్రజా నిరసన స్పూర్తిదాయకమన్నారు.
యూరప్(Europe) లోనూ నిరసనలు…
ట్రంప్‌నకు వ్యతిరేకంగా యూరప్ దేశాల్లోనే ఆందోళనలు జరిగాయి. ఆయన వాణిజ్య విధానాలను వ్యతిరేకిస్తూ పలు నగరాల్లో ప్రజలు ఆందోళనల్లో పాల్గొన్నారు. లండన్, బెర్లిన్ తదితర నగరాల్లో ఈ నిరసనలు జరిగాయి.
అర్హులకు ట్రంప్ అన్యాయం చేయరు: శ్వేతసౌధం
దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలపై అధ్యక్షుడి అధికార నివాసం శ్వేతసౌధం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘అధ్యక్షుడు ట్రంప్ ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. అర్హులకు సామాజిక భద్రత, వైద్య, ఆరోగ్య సాయానికి ఆయన ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. సామాజిక భద్రత, వైద్య, ఆరోగ్య సాయాలను డెమోక్రాట్లు.. అనర్హులకు అందించారు. దీనివల్ల ఈ కార్యక్రమాలు దివాలా తీశాయి. సీనియర్ సిటిజెన్లు నలిగిపోయారు’ అని అందులో పేర్కొంది.