Vladimir Putin: యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉంది : ట్రంప్

ఉక్రెయిన్‌ను కనికరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin ) కు తాను విజ్ఞప్తి చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. యుద్ధంలో ఆ దేశ పరిస్థితులు దారుణంగా ఉందని అన్నారు. కీవ్ సేనలను అన్ని వైపుల నుంచి రష్యా దళాలు చుట్టు ముట్టాయని తెలిపారు. అందుకే ఉక్రెయిన్ (Ukraine) సైనికులపై కనికరం చూపాలని తాను పుతిన్‌కు విజ్ఞప్తి చేశానని చెప్పారు. లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం (World War II) తర్వాత జరిగే అతి దారుణమైన ఊచ కోతగా ఇది మిగిలిపోతుందని అన్నారు. కాల్పుల విరమణకు సంబంధించి రష్యా (Russia) నుంచి మంచి సంకేతాలు వస్తున్నాయని, మాస్కోతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని అన్నారు. యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణకు సూత్రపాయంగా అంగీకరిస్తున్నానని పుతిన్ చేసిన ప్రకటనపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఆశాజనకమైన ప్రకటన. అయితే పూర్తి స్థాయి ప్రకటన కాదు. రష్యా కాల్పుల విరమణకు అనుకూలంగా ఉందో లేదో చూడాలి. ఒక వేళ లేకపోతే ప్రపంచానికి అది తీవ్ర నిరాశ కలిగించే క్షణం అవుతుంది అని ట్రంప్ పేర్కొన్నారు.