Tariff Rules: చైనాకో రూల్.. భారత్ కు మరో రూలా..? ట్రంప్ సర్కార్ పై డెమొక్రాట్ల ఫైర్..

భారత్ పై 50 శాతం సుంకాలు విధించడంపై మిత్రపక్షాల నుంచే కాదు.. స్వదేశంలోని విపక్షం నుంచి కూడా ట్రంప్ సర్కార్ కు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మీ విధానమేంటి..? భారత్ పై మాత్రమే ఎందుకు సుంకాలు అధికంగా విధించారు. అదే తరహాలో ప్రవర్తిస్తున్న చైనాపై ఎందుకు ఆస్థాయిలో సుంకాలు వేయలేదని విపక్ష డెమొక్రాట్లు ట్రంప్ నుప్రశ్నించారు.భారత్‌పై అంత పెద్ద మొత్తంలో సుంకాలు విధించడం సమంజసం కాదని డెమోక్రాట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఆక్షేపించింది. చైనా (China) కూడా మాస్కో (Russia) నుంచి పెద్ద మొత్తంలో ముడిచమురును కొనుగోలు చేస్తోందని, ఆ దేశంపై అమెరికా ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ట్రంప్‌ను ప్రశ్నించింది. అధ్యక్షుడి నిర్ణయం అమెరికా ప్రజలను కూడా బాధిస్తోందని తెలిపింది. ట్రంప్ తాజా నిర్ణయం గత రెండు దశాబ్దాలుగా బలోపేతమైన ఇండో అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.
‘‘రష్యా నుంచి అధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోన్న చైనా సహా ఇతర దేశాలపై ఆంక్షలను విధించని ట్రంప్ సర్కారు.. భారత్‌పై మాత్రం సుంకాలను అమాంతం పెంచుకుంటూ వెళ్తోంది. ఇది కేవలం భారత ప్రజలనే కాదు.. అమెరికన్ల మనోభావాలను కూడా దెబ్బతీస్తోంది. అమెరికా-భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ప్రతి దేశంపైనా ఆంక్షలు విధిస్తే సరే.. కానీ, ట్రంప్ తీరు అందుకు భిన్నంగా ఉంది. కేవలం భారత్‌పైనే సుంకాలు విధించడం గందరగోళం సృష్టిస్తోంది. రష్యా నుంచి అతిపెద్ద చమురు దిగుమతిదారు చైనా. ఇప్పటికీ రాయితీ ధరకు ముడి చమురు కొనుగోలు చేస్తోంది. ఆ దేశంపై ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు’’ అంటూ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కూడా ఈ సందర్భంగా ప్యానెల్ ప్రస్తావించింది.
అమెరికా విధించిన తాజా సుంకాలు 48.2 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులపై ప్రభావం చూపిస్తాయని భారత్ అంచనా వేస్తోంది. కొత్త సుంకాల వల్ల అమెరికాకు ఎగుమతులు వాణిజ్యపరంగా అంత లాభసాటిగా ఉండబోవని, ఆర్థిక వృద్ధి మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, అమెరికా ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టంచేశారు. ప్రస్తుతానికి ఔషధాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి రంగాలను అదనపు సుంకాల నుంచి అమెరికా మినహాయించింది. ఈ రంగాల్లో భారత్ ఎగుమతి అధిక స్థాయిలో ఉండటం కొంత ఉపశమనం కలిగించే విషయంగా చెప్పవచ్చు.