భారత్ కే అమెరికా మద్దతు : రాజా కృష్ణమూర్తి
భారత సరిహద్దులోని లద్దాఖ్‌లో చైనా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తుండటం కచ్చితంగా రెచ్చగొట్టే చర్యే అని భారత సంతతికి చెందిన అమెరికా చట్ట సభ్యుడు రాజా కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా చైనా కుట్రలు తెలుస్తున్నాయని, క్షేత్రస్థాయిలోని వాస్తవాలను మార్చివేయడమే దాని ఉద్దేశమని తెలిపారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అనుసరిస్తున్న దుందుడుకు ధోరణినే డ్రాగన్ ఇక్కడా ప్రదర్శిస్తోందని చెప్పారు. అక్కడ అక్రమ దీవులను నిర్మించడం లాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. డెమొక్రటిక్ పార్టీ తరపున వరుసగా మూడోసారి రాజా కృష్ణమూర్తి కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. బైడెన్ హయాంలో నిఘాకు సంబంధించిన ఏర్పాటు చేసిన యూఎస్ హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉండబోతున్నారు. ఆ హోదా దక్కించుకున్న తొలి భారతీయ అమెరికన్ ఆయనే. ట్రంప్ హయాంలో లాగే బైడెన్ అధ్యక్షుడయిన తర్వాతా భారత్‌కు, ఇండో-పసిఫిక్ దేశాలకు అమెరికా అండగా నిలుస్తుందని కృష్ణమూర్తి చెప్పారు.
ఇటీవలే మలబార్ తీరంలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా చేపట్టిన సంయుక్త నావికా విన్యాసాలు..ఇండో- పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు ఎప్పటికీ పరస్పరం అండగా ఉంటాయన్న సంకేతాన్నిచ్చాయని పేర్కొన్నారు. బైడెన్ సుదీర్ఘ కాలంగా భారత్‌కు స్నేహితుడిగా ఉన్నారని ఆయన తెలిపారు. భారత మూలాలున్న కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ఎంపికచేసుకోవడం ద్వారా అమెరికా- భారత్ సంబంధాలు మరింత బలపడనున్నాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆంటోనీ బ్లింకెన్ కూడా భారత్‌కు స్నేహితుడే అని కృష్ణమూర్తి చెప్పారు. ఆయనకు ఇండో-పసిఫిక్ ప్రాంతంపై మంచి అవగాహన ఉందని తెలిపారు. బైడెన్-కమల-బ్లింకెన్ త్రయం నేతృత్వంలో అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలను అధిరోహిస్తాయని పేర్కొన్నారు. భారత్‌పై చైనా సహా మారే సరిహద్దు దేశమూ సైనిక చర్యకు పాల్పడటాన్ని అమెరికా గట్టిగా వ్యతిరేకిస్తుందని సృష్టం చేశారు. అలాగే కరోనా మహమ్మారిని అంతం చేసేందుకూ అమెరికా, భారత్, ఇతర మిత్ర పక్షాలు కలసికట్టుగా కృషి చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.






