నాటో దేశాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్
రష్యాను ఢీకొట్టడానికి గాను ఉక్రెయిన్ దళాలకు ఫైటర్ జెట్లు అందజేయడానికి నాటో దేశాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ నాటో దేశాల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం గమనార్హం. ఉక్రెయిన్‌కు ఫైటర్ జెట్లు అందజేసి, సహకరించడానికి ఇప్పటిదాక నాటో దేశాలేవీ ముందుకు రాలేదు. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన విన్నపాలు సైతం పనిచేయడం లేదు. ఫైటర్ జెట్లు పంపించాలని ఆయన పదే పదే కోరుతున్నా మిత్ర దేశాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. గగనతల శక్తిలో ఉక్రెయిన్ కంటే రష్యా ఎన్నో రెట్లు ముందంజలో ఉంది. ఉక్రెయిన్ వద్ద కేవలం 67 ఫైటర్ జెట్టు, 34 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. రష్యా అమ్ముల పొదిలో ఏకంగా 1,500 ఫైటర్ జెట్లు, 538 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఉక్రెయిన్‌కు ఏ దేశమైనా సహకరిస్తే ఆ దేశం నేరుగా తమపై యుద్ధం సాగిస్తున్నట్లు గానే పరిగణిస్తామని రస్యృా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఆర్మీని గానీ, వైమానిక దళాన్ని గానీ పంపించబోమని అమెరికా తెలిపింది.






