Minister Komatireddy: డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ ను తప్పించి, సమర్థులకు అవకాశం : మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేత సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy) కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. డీసీసీ (DCC) బాధ్యతల నుంచి కైలాష్ (Kailash) ను తప్పించి, సమర్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడిగా తాజాగా నియమితులైన కైలాష్ తనను, తన కుటుంబ సభ్యులను అవమానించే రీతిలో అకారణంగా దుర్భాషలాడిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) , ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal,), పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌కు లేఖలు రాశారు. ఆ వీడియోలను, వాటి సమాచారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల ద్వారా అందజేశారు. కైలాష్ గతంలో తనను ఇలాగే దూషించినా తాను ఏమీ అనలేదని, ఇప్పుడు బాధ్యత కలిగిన పదవిలోకి వచ్చిన తర్వాత కూడా అసభ్యకర పదజాలంతో ఉన్న వీడియోలను వైరల్ చేయించడం తనకు ఆవేదన కలిగించిందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. కైలాష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అతడిని డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, సమర్థులకు అవకాశం ఇవ్వాలని సీఎంకు రాసిన లేఖలో కోరారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్ష సాధింపు ధోరణికి పాల్పడలేదని, అయిదుసార్లు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎంపీగా గెలిచానని, తెలంగాణ కోసం నాడు మంత్రి పదవిని త్యజించానని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ వెంకటరెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేయగా సీఎం, ఇతర మంత్రులు సముదాయించినట్లు తెలిసింది. కాగా, మంత్రి ఫిర్యాదును సీఎం, పీసీసీ చీఫ్ సీరియ్‌సగా తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.






