Mega Hyderabad : మెగా సిటీగా హైదరాబాద్!
నవాబుల కాలం నాటి భాగ్యనగరం మరో చారిత్రక మలుపు తిరగబోతోంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ (Hyderabad), ఇకపై బృహత్ నగరం (Mega City)గా అవతరించనుంది. అవుటర్ రింగ్ రోడ్ (ORR) ను ప్రామాణికంగా తీసుకుని, దాని లోపల, ఆనుకుని ఉన్న 27 నగర, పురపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పట్టణీకరణ చరిత్రలోనే ఇది ఒక కీలక ఘట్టం అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం, నగర భౌగోళిక, రాజకీయ, పరిపాలనా స్వరూపాన్ని పూర్తిగా మార్చేయనుంది.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్న 27 పట్టణ స్థానిక సంస్థలు ఇప్పుడు జీహెచ్ఎంసీలో అంతర్భాగం కానున్నాయి.
1. బండ్లగూడ జాగీర్
2. బోడుప్పల్
3. పీర్జాదిగూడ
4. మీర్పేట్
5. జవహర్నగర్
6. నిజాంపేట్
7. బడంగ్పేట్
8. మణికొండ
9. నార్సింగి
10. శంషాబాద్
11. తుర్కయంజాల్
12. పెద్ద అంబర్పేట్
13. ఆదిభట్ల
14. తుక్కుగూడ
15. జల్పల్లి
16. దుండిగల్
17. మేడ్చల్
18. దమ్మాయిగూడ
19. నాగారం
20. పోచారం
21. ఘట్కేసర్
22. గుండ్ల పోచంపల్లి
23. తూంకుంట
24. కొంపల్లి
25. బొల్లారం
26. తెల్లాపూర్
27. అమీన్పూర్
ఈ మహా విలీన ప్రక్రియ పూర్తయితే హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటిగా, కొన్ని చిన్న రాష్ట్రాల జనాభాతో సమానంగా ఎదగనుంది. ఈ బృహత్ నగరం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి సహా మొత్తం 5 జిల్లాల పరిధిలో విస్తరించి ఉంటుంది. 47 మండలాలు, 311 గ్రామాలతో కూడిన ఈ కొత్త నగర పరిధిలో ఏకంగా 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలు ఉండటం గమనార్హం. అంటే రాష్ట్ర రాజకీయాల్లో సగానికి పైగా ప్రభావం ఈ ఒక్క నగరానిదే కానుంది. ప్రస్తుతం 1.45 కోట్లుగా ఉన్న జనాభా, ఓఆర్ఆర్ వరకు విస్తరిస్తే 1.70 కోట్లకు చేరుతుంది. రాబోయే జనగణన నాటికి ఇది 2 కోట్లను దాటే అవకాశం ఉందని అంచనా.
బడంగ్పేట్, నిజాంపేట్, మణికొండ వంటి ప్రాంతాలు ఇప్పటికే అధిక జనసాంద్రతతో కిక్కిరిసిపోయాయి, కానీ మౌలిక వసతుల్లో కోర్ సిటీతో పోటీపడలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలందరి నుంచి వసూలు చేసే పన్నుల్లో వ్యత్యాసాలు లేకుండా చూడటం ముఖ్యం. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతి ప్రాంతానికి జీహెచ్ఎంసీ స్థాయి డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సరఫరాను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. వేర్వేరు మున్సిపల్ చట్టాల వల్ల వస్తున్న ఇబ్బందులను తొలగించి, ఒకే గొడుగు కిందకు పాలనను తీసుకురావడం ద్వారా పరిపాలన సౌలభ్యం కలుగుతుంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరితో ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగుస్తుంది. అయితే, ఈ లోపు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. 27 మున్సిపాలిటీల విలీనానికి అవసరమైన జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాల’ సవరణలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ జోన్ మొదలుకొని, ఐటీ కారిడార్లోని తెల్లాపూర్, నిజాంపేట్ వరకు, అలాగే ఉప్పల్ వైపున్న పీర్జాదిగూడ, ఘట్కేసర్ వరకు అంతా ఒకే మహానగరంగా మారుతుంది. ఇది అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇప్పటికే సిబ్బంది కొరత, నిధుల లేమితో సతమతమవుతున్న జీహెచ్ఎంసీ, కొత్తగా వచ్చి చేరే ఈ 27 ప్రాంతాల భారాన్ని, అక్కడి ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేరుస్తుందనేదే రాబోయే రోజుల్లో అతిపెద్ద సవాలు.






