Jagga Reddy: వారినే సర్పంచ్ అభ్యర్థులుగా ఎంపిక చేయాలి : జగ్గారెడ్డి
కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు సైతం పార్టీ కండువా కప్పుకొని పని చేసిన వారినే సర్పంచ్ (Sarpanch) అభ్యర్థులుగా ఎంపిక చేయాలని, వారి వద్ద డబ్బులున్నా, లేకున్నా, సర్పంచ్‌లుగా గెలిపించుకురావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి (Jagga Reddy) సూచించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల్లో కాంగ్రెస్ తరఫున సర్పంచ్‌లను గెలిపించి తీసుకొస్తే, సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దగ్గరకు తీసుకెళ్లి నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. సోనియా, రాహుల్, ఖర్గే నాయకత్వం లో సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్న రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, రూ.2లక్షల రుణమాఫీ, వరికి బోనస్, రైతు భరోసా గురించి చెప్పి ఓట్లు అడగాలన్నారు. రిజర్వేషన్‌పై పోటీ చేసే ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులుకు ఇతర నేతలు ఆర్థికంగా సహకరించాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, ఎంతటి వారైనా క్షమించనని జగ్గారెడ్డి హెచ్చరించారు.






