బైడెన్ రాక ఇండియాకు మంచిదే…
న్యూజెర్సి తెలుగు ప్రముఖులు రావు కల్వల అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలుపుకు కృషి చేసిన వారిలో ఒకరు. బైడెన్ గెలిచిన తరువాత తెలుగుటైమ్స్‌తో ఆయన మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలను పాఠకుల కోసం ఇక్కడ అందిస్తున్నాము.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక ఇండియాకు, అమెరికాలో ఉంటున్న భారత సంతతికి మేలు చేకూర్చేలా ఉంటుంది. గతంలో కన్నా భారత్‌తో సంబంధాలు బైడెన్ హయాంలో మరింత బలపడనున్నాయి. ఒక ఇండియన్ అమెరికన్ న్యూస్ పేపర్లో బైడెన్ అక్టోబర్‌లో రాసిన ఓ వ్యాసం కూడా దీనినే స్పష్టం చేస్తున్నది. వివిధ రంగాల్లో భారత్‌తో సంబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, అన్నీ రంగాల్లో కలిసి నడవనున్నట్లు బైడెన్ అందులో తెలిపారు. టెర్రరిజంను ఎదుర్కోవడానికి భారత్‌తో కలిసి పనిచేయాలని, ఏసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని చైనా కానీ, ఏ దేశమైనా కూడా భంగపరచకుండా ఇండియాతో కలిసి పనిచేస్తామని బైడెన్ తన వ్యాసంలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఓ బిజినెస్ మ్యాన్‌లాగా వ్యవహరించకుండా, చెప్పాలంటే ట్రంప్ హయాంలో లాగా బైడెన్ విధానాలు ఉండబోవు. ట్రంప్ హయాంలో అమెరికా కోరుకున్నది ఇస్తే అనుకూలంగా వ్యవహరించడం, లేదంటే వ్యతిరేక చర్యలు చేపట్టడం వంటివి జరిగిన సంగతి తెలిసిందే.
బంధాలు బలపడుతాయి…
రాజకీయంలో, పాలనా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే భారత్‌తో సంబంధాలు మరింత బలపడుతాయి. యుఎస్‌తో వాణిజ్య ఒప్పందాలకు పెద్దగా ఆటంకాలు ఉండవు. అలాగే ఇమ్మిగ్రేషన్, హెచ్1బి వీసా లాంటి వ్యవహారాలు భారతదేశానికి సానుకూలంగా ఉంటాయి. ఇది యుఎస్, ఇండియా ఐటీ కంపెనీలకి మేలు చేస్తుంది. డెమొక్రాట్స్ ఎప్పుడూ ప్రజాస్వామ్యం, మానవహక్కులకే ప్రాధాన్యం ఇచ్చినా కూడా యుఎస్ ఇండియా సంబంధాలపై వీటి ప్రభావం పెద్దగా ఉండదని చెప్పవచ్చు. పాకిస్తాన్ అమెరికాకు మిత్రపక్షంగా ఉన్నా ఆఫ్ఘన్ విషయంలో పాక్ వ్యవహరించిన తీరు వల్ల అమెరికా సైనికులకు నష్టం జరిగిందన్న విషయం బైడెన్‌కు తెలుసు. అందువల్ల పాక్‌తో ఆయన వైఖరి కఠినంగా ఉండవచ్చు. అగ్రరాజ్యమైన అమెరికాకు బైడెన్ లాంటి అనుభవశాలి ప్రెసిడెంట్ గా రావడం వల్ల భారతదేశంతో సహా ప్రపంచం మొత్తానికి మంచి జరుగుతుంది.
ఇమ్మిగ్రేషన్ పాలసీ
ఇమ్మిగ్రేషన్ పాలసీలో ట్రంప్ దాదాపు 400కుపైగా మార్పులు చేశారు. కానీ దానివల్ల చట్టవిరుద్ధమైన ఇమ్మిగ్రేషన్ మాత్రమే కాకుండా చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ కూడా చాలావరకు తగ్గిపోయింది. ఈ మార్పులను ఉపసంహరించడం పెద్దపనేమి కాదు. బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కాని, లేదా ఏజెన్సీ హెడ్స్ ద్వారా మెమోలు జారీ చేయడం ద్వారా ఈ మార్పులను రద్దు చేయవచ్చు. కాని కొన్ని విధానాలకు మాత్రం కోర్టులో ఉన్న వివాదాల వల్ల, బ్యూరోక్రసీ వల్ల సవరించడానికి సమయం పడుతుంది. బైడెన్ ఇమ్మిగ్రేషన్ పాలసీ డాక్యుమెంట్లో వివిధ దేశాలకు ఉద్యోగపరంగా ఉన్న ఇమ్మిగ్రేషన్ పరిమితిని ఎత్తివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీని వల్ల ముఖ్యంగా భారతీయులకు గ్రీన్‌కార్డు జారీలో ఉన్న జాప్యాన్ని నివారించవచ్చు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్?అటార్నీలు ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్ విధానాలు సరైనవేనా లేక వేరే మార్చాలా అన్నది నిర్ణయించనున్నారు. అలాగే బైడెన్‌కు ఓటు వేసిన వారిలో మెజారిటీవారు కోరినట్లుగా డాకా విధానాన్ని కొనసాగిస్తారు.
ఎఆర్టీలో భారతీయులు
ట్రంప్ నుంచి పాలనా బాధ్యతలు సజావుగా బదలీ అయ్యేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ట్రాన్సిషన్ టీమ్‌లో దాదాపు 20 మంది భారతీయ అమెరికన్లకు చోటు లభించింది. అందులో ముగ్గురు భారతీయ అమెరికన్లు తమ టీమ్‌కు లీడ్స్‌గా కూడా ఉన్నారు. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌కు సహ అధ్యక్షుడిగా మాజీ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి వ్యవహరిస్తున్నారు. స్టాన్‌పోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అరుణ్ మజుందార్ ఎనర్జీ ట్రాన్సిషన్ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. మార్చ్ ఆఫ్ డైమ్స్కు చెందిన రాహుల్ గుప్తా నేషనల్ డ్రగ్ పాలసీ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఫిలాంత్రపీ నార్త్‌వెస్ట్‌కు చెందిన కిరణ్ అహుజా ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనెజ్మెంట్ బృందాన్ని లీడ్ చేస్తున్నారు. ప్రవీణ రాఘవన్, ఆత్మ త్రివేదిలను వాణిజ్య శాఖ బృందంలో నియమించారు. విద్యాశాఖకు షీతల్ షా, ఇంధనశాఖకు ఆర్. రమేష్, రమా జకారియా, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీలో శుభశ్రీ రామనాథన్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్‌కు రాజ్ దే, కార్మిక శాఖకు సీమా నంద, రాజ్నాయక్ను నియమించారు.
ఫెడరల్ రిజర్వ్, బ్యాంకింగ్, సెక్యూరిటీ రెగ్యులేటర్లకు రీనా అగర్వాల్, సత్యం ఖన్నా, నాసాకు భవ్య లాల్, జాతీయ భద్రతామండలికి దిల్‌ప్రీత్ సిద్ధు, ఆఫీస్ ఆఫ్ మేనెజ్మెంట్-బడ్జెట్‌కు దివ్య కుమరయ్య, వ్యవసాయశాఖకు కుమార్ చంద్రన్, యుఎస్ పోస్టల్ సర్వీస్‌కోసం అనీష్ చోప్రాను నియమించారు. ఈ టీమ్‌లో ఉన్న చాలామంది స్వచ్ఛంద సంస్థలలో సేవలందిస్తున్నవారే కావడం విశేషం.
– రావు కల్వల
732 309 0621






