భారత్ తో బంధం మరింత బలోపేతం….బైడెన్
కోవిడ్ లాంటి అంతర్జాతీయ సవాళ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ పేర్కొన్నారు. బైడెన్‌తో ఫోన్లో సంభాషించినట్లు మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణపై బైడెన్ బృందం ప్రకటన విడుదల చేసింది. తనకు ఫోన్ చేసి అభినందించిన మోదీకి బైడెన్ కృతజ్ఞతలు తెలిపారని, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిసతో కలిసి భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిభద్రతల నిర్వహణ, ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను రికవరీ బాట పట్టించడం లాంటి అంశాలపై మోదీతో కలిసి పనిచేయాలని చూస్తున్నట్లు బైడెన్ తెలిపారు. కొవిడ్‌పై పోరాటం, భవిష్యత్తు ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడం వంటి అంశాలపై మోదీతో కలిసి పనిచేయడానికి బైడెన్ ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.






