America: పాక్‌కు అమెరికా ఝలక్ …చేతులెత్తేసిన ట్రంప్ యంత్రాంగం

పాకిస్థాన్ కష్టాల్లో ఉన్నప్పుడు, భారత్ నుంచి దానికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడల్లా రంగంలోకి దిగి ఆదుకునే మిత్రదేశమైన అమెరికా(America) తొలిసారి ఆ దేశానికి మొండిచేయి చూపింది. పహల్గాంలో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను పొట్టనపెట్టుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్ .. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాక్ డ్రోన్లతో భారత స్థావరాలపై దాడికి ప్రయత్నించిన చావుదెబ్బ తిన్నది. భారత బలగాలు చైనా (China) నుంచి పాక్ దిగుమతి చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నిటీని ధ్వంసం చేశాయి. కరాచీపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడిచేశాయి.
భారత్ ప్రతిస్పందన ఇంత తీవ్రంగా ఉంటుందని పాకిస్థాన్, చైనా తుర్కియేతో పాటు అమెరికా కూడా ఊహించలేదు. ఉగ్రస్థావరాలపై ఇండియా చేసిన దాడులను సమర్థించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కవ్వింపులకు దిగవద్దని పాక్‌ను ముందే హెచ్చరించారు. అయినా 15 భారతీయ నగరాలను డ్రోన్లు, రాకెట్లతో ధ్వంసం చేయడానికి పాక్ సైన్యం ప్రయత్నించింది. వాటిని సమర్థంగా అడ్డుకుని నాశనం చేసిన భారత్ నిర్ణయాత్మక దాడులకు సర్వసన్నద్ధంగా ఉంది. అయినా పరిస్థితుల్లో మార్పు లేకపోవడం, భారత్‌పై డ్రోన్ దాడులను పాక్ కొనసాగించడంతో అమెరికా ప్రభుత్వం ఇండియా (India)కే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సంక్షోభంలో జోక్యం చేసుకోబోమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దౌత్యం ద్వారా ఉద్రిక్తతలు చల్లార్చేందుకు ప్రోత్సహిస్తామని, కానీ సైనికంగా తలదూర్చబోమని స్పష్టం చేశారు. ఆయుధాలు వదివేయాలని ఎవరినీ కోరబోమని, దౌత్య చర్చలతోనే ఉద్రిక్తతలు చల్లార్చుకోవాలని సూచించారు.