America: భవిష్యత్‌లో భారత్-పాక్ ప్రత్యక్ష చర్చలకు మద్దతు : అమెరికా

భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా విదేశాంగ శాఖ స్వాగతించింది. జ్ఞానం, వివేకం, రాజనీతిజ్ఞతతో సరైన మార్గాన్ని ఎంచుకున్న ఇరుదేశాల నాయకత్వాన్ని ప్రశంసించింది. రెండు దేశాల మధ్య సంఘర్షణ నివారణకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించింది. భారత ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi), పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ (Shehbaz Sharif) లు శాంతిమార్గాన్ని ఎంచుకోవడంలో చూపిన జ్ఞానం, వివేకం, రాజనీతిజ్ఞతను మేము అభినందిస్తున్నాం. ప్రత్యక్ష చర్చల ద్వారా దాయాదులు సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Marco Rubio ) కోరుకుంటున్నారు. భవిష్యత్‌లోనూ ఇరుదేశాల ఘర్షణలను నివారించడానికి, చర్చలను మరింత సులభతరం చేయడానికి అమెరికా మద్దతు అందిస్తూనే ఉంటుంది అని యూఎస్ విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తేలేదని పునరుద్ఘాటించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడారు. చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. అంతేకాదు ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని రూబియో స్పష్టం చేశారు.