NJ: న్యూజెర్సీ సాయిదత్తపీఠంలో ఘనంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం

న్యూజెర్సిలోని శ్రీ సాయిదత్త పీఠం ఉగాది (Ugadi), శ్రీరామనవమి (Sriramnavami) వేడుకలను పురస్కరించుకుని ఉగాది పండగ నుంచి మొదలుకుని శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 6 వరకు రకరకాల కార్యక్రమాలు జరిపింది. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా.. ఏప్రిల్ 5వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపింది. ఆ తర్వాతి రోజున (ఏప్రిల్ 06న) రామ పరివార పూజ, శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 6 వరకు ప్రతీ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సంపూర్ణ వాల్మీకి రామాయణ పారాయణం నిర్వహించారు. ఈ రామాయణ పారాయణాన్ని.. బ్రహ్మశ్రీ శ్రీనాథ శర్మ, మహాదేవ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పలువురు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శ్రీ రామామృత శత గళార్చన
వేడుకల్లో భాగంగా మహతి మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో దాదాపు వందకు పైగా పిల్లలు, మహిళలు సంగీతంతో శ్రీ రామామృత గానం చేసి అందరిని అలరించారు. ఈ కార్యకమం తెలుగు కళాసమితి అధ్యక్షులు మధు అన్న కూడా పాల్గొనడం విశేషం. శత గళార్చన పేరుతో వంద మంది చిన్నారుల చేత శ్రీ రామ కీర్తనలు పాడిరచటం ఇది పదవ సంవత్సరం అని ఇన్ని సంవత్సరాలుగా శ్రీ రామనవమి పండుగకు ఈ సంగీత నీరాజనం చేయటం చాలా అదృష్టమని మధు అన్న అన్నారు. మహతి మ్యూజిక్ అకాడమీ వారిని, శ్రీమతి రేఖా బ్రహ్మసముద్రంని, పాడిన పిల్లలను అభినందనలు తెలియచేసారు. తెలుగు టైమ్స్ పత్రిక ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ మధు అన్నను, మహతి మ్యూజిక్ అకాడమీ పిల్లలను, గురువు శ్రీమతి రేఖా బ్రహ్మసముద్రం చేసిన కృషిని అభినందించారు.