South Africa: భారత్ సెమీస్ ఆశలకు సఫారీల శ్వాస..!
సూపర్ -8 ఫైట్ తొలిమ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు చేతిలో ఘోరంగా ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత్ కు సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసిన అదే సఫారీ జట్టు.. ఇప్పుడు ఇండియా సెమీస్ ఆశలను నిలిపింది . విండీస్ జట్టుపై సౌతాఫ్రికా ఘనవిజయం సాధించడంతో.. భారత్ సెమీస్ ప్రయాణం సుగమమైందని చెప్పవచ్చు. అయితే ఈ ఓటమితో విండీస్ సెమీస్ అవకాశాలు కాస్త దెబ్బతిన్నాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పవర్‌ప్లేలోనే 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒక దశలో 10.2 ఓవర్లలో 83/7 స్కోరుతో కుప్పకూలేలా కనిపించింది. అయితే, ఈ క్లిష్ట సమయంలో జాసన్ హోల్డర్ (49), రొమారియో షెపర్డ్ (37 బంతుల్లో 52 నాటౌట్) అద్భుతంగా పోరాడారు. ఎనిమిదో వికెట్‌కు 89 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. దీంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. సఫారీ బౌలర్లలో లుంగీ ఎన్గిడి మూడు వికెట్లతో రాణించాడు.

ఇవి కూడా చదవండి
అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. విండీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కేవలం 16.1 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. మరో 23 బంతులు మిగిలి ఉండగానే భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. క్వింటన్ డికాక్ కేవలం 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (46 బంతుల్లో 82 నాటౌట్), ర్యాన్ రికెల్టన్ (28 బంతుల్లో 45 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా కేవలం 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి జట్టుకు ఘనవిజయాన్ని అందించారు. ఈ టోర్నీలో సఫారీలకు ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం.
ఈ మ్యాచ్ ఫలితం సూపర్-8 గ్రూప్-1 సమీకరణాలను ఆసక్తికరంగా మార్చింది. ఈ గ్రూప్‌లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. దక్షిణాఫ్రికా విజయంతో వెస్టిండీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇది భారత్‌కు ప్రత్యక్షంగా మేలు చేసింది.
ఇవి కూడా చదవండి






