IND vs ENG: సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం!
టీ20 వరల్డ్ కప్-2026 సెమీఫైనల్ (INDvsENG) పోరు అభిమానులకు అసలు సిసలైన టీ20 మజాను అందించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా గురువారం జరిగిన ఈ హై-స్కోరింగ్ థ్రిల్లర్‌లో.. పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును 7 పరుగుల స్వల్ప తేడాతో మట్టికరిపించిన టీమిండియా సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ నిలబెట్టుకునే దిశగా అడుగు దూరంలో నిలిచిన భారత జట్టు.. ఆదివారం జరగనున్న మెగా ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రికార్డుల మోత మోగిన ఈ మ్యాచ్‌లో (INDvsENG) ఇరు జట్లు కలుపుకుని ఏకంగా 499 పరుగులు చేయడం గమనార్హం.
శాంసన్ ఊచకోత.. భారత్ భారీ స్కోరు..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు (INDvsENG) దిగిన టీమిండియాను సంజూ శాంసన్ (89) మరోసారి ఆదుకున్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (9) త్వరగానే అవుటైనా.. ఇషాన్ కిషన్ (39) సహకారంతో శాంసన్ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగి సెంచరీకి చేరువలో అవుటయ్యాడు. వీరికి తోడుగా మిడిలార్డర్లో శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (21) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం. పాండ్యా చేసిన సమన్వయ లోపంతో దూబే దురదృష్టవశాత్తూ రనౌట్ కావాల్సి వచ్చింది. దీనికి పాండ్యా మైదానంలోనే క్షమాపణలు కూడా చెప్పాడు.
ఆఖర్లో అద్భుతం చేసిన బౌలర్లు..
అనంతరం 254 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ (INDvsENG) సాల్ట్ (5), బ్రూక్ (7), బట్లర్ (25) వికెట్లను పవర్ ప్లేలోనే కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో యువ కెరటం జాకబ్ బెథెల్ (105) సృష్టించిన విధ్వంసం భారత శిబిరంలో వణుకు పుట్టించింది. విల్ జాక్స్ (35) అండతో కేవలం 48 బంతుల్లోనే బెథెల్ సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్‌ను గెలుపు ముంగిట నిలబెట్టాడు. ఒక దశలో 18 బంతుల్లో 45 పరుగులు కావాల్సిన తరుణంలో ఇంగ్లండ్ సునాయాసంగా గెలుస్తుందని అంతా భావించారు.
ఇవి కూడా చదవండి
సరిగ్గా అప్పుడే భారత బౌలర్లు మాయ చేశారు. 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులే ఇవ్వగా.. 19వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీసి 9 పరుగులే ఇచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ (INDvsENG) విజయానికి 30 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికే పాండ్యా విసిరిన అద్భుతమైన త్రోకి బెథెల్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో ఆర్చర్ సిక్సర్లు కొట్టినా, ఇంగ్లండ్ 246/7 స్కోరుకే పరిమితమైంది.
బుమ్రా సరికొత్త రికార్డు..
ఈ మ్యాచ్‌లో (INDvsENG) ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్‌ను అవుట్ చేయడం ద్వారా బుమ్రా.. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 8వ భారత బౌలర్‌గా నిలిచాడు. మరోవైపు ఫీల్డింగ్‌లో అక్షర్ పటేల్ పట్టిన రెండు అద్భుతమైన డైవింగ్, బౌండరీ లైన్ క్యాచ్‌లు (బ్రూక్, విల్ జాక్స్) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. ఈ అద్భుత విజయంతో సూర్యకుమార్ యాదవ్ సేన ఉత్సాహంగా ఫైనల్ బరిలోకి దిగనుంది.
ఇవి కూడా చదవండి






