ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు..!
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్(KL Rahul) ఐపీఎల్(IPL) చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అద్భుతమైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన 51వ మ్యాచ్‌లో రాహుల్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మూడు వేర్వేరు ఐపీఎల్ జట్ల తరపున.. అంటే పంజాబ్ కింగ్స్(PBKS), లక్నో సూపర్ జెయింట్స్(LSG), మరియు ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తో.. 1,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా రాహుల్ చరిత్ర సృష్టించాడు.
గతంలో ఢిల్లీ తరపున అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన రికార్డు రిషబ్ పంత్(Rishab Pant), జేపీ డుమిని పేరిట ఉండేది. వీరిద్దరూ ఈ మార్కును దాటడానికి తల 35 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. అయితే, కేఎల్ రాహుల్ కేవలం 24 ఇన్నింగ్స్‌ల్లోనే 1,000 పరుగుల మార్కును చేరుకుని, వారి రికార్డును తుడిచిపెట్టేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్(DC) తరపున వెయ్యి పరుగులు పూర్తి చేసిన 11వ బ్యాటర్‌గా కూడా నిలిచాడు. గణాంకాల పరంగా చూస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రాహుల్ ప్రదర్శన అత్యంత నిలకడగా సాగుతోంది.
ప్రస్తుతం రాహుల్ 50.35 సగటుతో మొత్తం 1,007 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో రెండు అద్భుతమైన సెంచరీలు మరియు ఆరు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. కీలకమైన సమయంలో రాహుల్ ఫామ్‌లోకి రావడమే కాకుండా, ఇలాంటి భారీ రికార్డులను అధిగమించడం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరియు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ.. మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరపున ఇంతటి నిలకడ ప్రదర్శించి 1,000 పరుగుల చొప్పున సాధించడం కేఎల్ రాహుల్‌కే సాధ్యమైంది.






