IND vs WI: సెమీస్ బెర్త్ కోసం ‘డూ ఆర్ డై’ ఫైట్.. విండీస్‌తో భారత్ పోరు!
టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో భారత జట్టుకు (INDvsWI) అత్యంత కీలక సమయం ఆసన్నమైంది. గ్రూప్-1 నుంచి సెమీ-ఫైనల్ బెర్త్ కోసం ఆదివారం వెస్టిండీస్‌తో జరిగే పోరులో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు ‘డూ ఆర్ డై’ లాంటిది. గెలిచిన జట్టు సెమీస్‌లో దర్జాగా అడుగుపెడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికా దర్జాగా సెమీస్ చేరుకున్న సంగతి తెలిసిందే.
భారత్ వ్యూహాలు..
సూపర్-8లో సౌతాఫ్రికా (INDvsWI) చేతిలో అనూహ్యంగా ఎదురైన ఓటమితో భారత్ సెమీస్ సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి. అయితే గత మ్యాచ్‌లో జింబాబ్వేపై సాధించిన భారీ విజయంతో సూర్యకుమార్ సేన తిరిగి పూర్తి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లకు తోడుగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నాడు.
మరోవైపు వెస్టిండీస్ (INDvsWI) జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దని, తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హెచ్చరిస్తున్నారు. ఆ జట్టులో హెట్మెయర్, పావెల్, రూథర్‌ఫోర్డ్, హోల్డర్, షెఫర్డ్ వంటి భీకర ఫామ్‌లో ఉన్న హిట్టర్లు ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు కుదురుకున్నా స్కోరు బోర్డు పరుగులు పెడుతుంది. బౌలింగ్‌లో గుడకేశ్ మోటీ, అకేల్ హుస్సేన్, షమర్ జోసెఫ్‌ల దాడులను భారత (INDvsWI) బ్యాటర్లు ఆచితూచి ఎదుర్కోవాలి. ముఖ్యంగా కోల్‌కతా పిచ్‌పై విండీస్ ఇప్పటికే ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండటం వారికి అదనపు బలం.
ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్..
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, మ్యాచ్ (INDvsWI) సాగేకొద్దీ స్పిన్నర్లకు కూడా అద్భుతంగా సహకరిస్తుంది. ఈ వరల్డ్‌కప్‌లో ఇక్కడ జరిగిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశమే ఎక్కువ. అయితే రాత్రి సమయంలో మంచు (Dew) ప్రభావం ఉంటే మాత్రం రెండో ఇన్నింగ్స్‌లో ఛేజింగ్ కాస్త సులభతరం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రికార్డులు మనవైపే..
టీ20 ఫార్మాట్లో విండీస్‌పై (INDvsWI) భారత్‌దే స్పష్టమైన ఆధిపత్యం. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 30 మ్యాచ్‌ల్లో భారత్ 19 సార్లు గెలుపొందగా, విండీస్ 10 మ్యాచ్‌ల్లో నెగ్గింది (ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు). విశేషమేమిటంటే, నేటి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్‌తో ఆడిన నాలుగు టీ20ల్లోనూ టీమిండియానే విజయం సాధించి అజేయ రికార్డును సొంతం చేసుకుంది.






