చావో రేవో తేల్చుకోనున్న ఢిల్లీ-కోల్‌కతా..!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అత్యంత కీలకమైన పోరు జరగనుంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (DC), ఎనిమిదో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తలపడనున్నాయి. రెండు జట్లకు ప్లేఆఫ్(IPL Play Offs) ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు అనివార్యం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే కోల్‌కతా నైట్ రైడర్స్ పైచేయి సాధించింది.
ఇప్పటివరకు జరిగిన 35 మ్యాచుల్లో కేకేఆర్ 19 సార్లు విజయం సాధించగా, ఢిల్లీ 15 సార్లు మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ముఖ్యంగా గత మూడు మ్యాచుల్లో కేకేఆర్ వరుస విజయాలతో ఢిల్లీపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అయితే, అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 10 మ్యాచుల్లో కేకేఆర్ 6 గెలిస్తే, ఢిల్లీ 4 గెలిచింది. సొంత ప్రేక్షకుల మద్దతు మధ్య ఢిల్లీ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఢిల్లీ జట్టులో కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో 9 వికెట్లతో రాణిస్తుండగా, బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్(KL Rahul) ఆరెంజ్ క్యాప్(Orange Cap) రేసులో దూసుకుపోతున్నాడు.
రాహుల్ ఈ సీజన్లో 184 స్ట్రైక్ రేట్‌తో 468 పరుగులు చేసి భీకర ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు కోల్‌కతా జట్టుకు సునీల్ నరైన్ ప్రధాన బలంగా మారాడు. ఐపీఎల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న నరైన్, తన ఎకానమీతో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా 10 వికెట్లతో కేకేఆర్ బౌలింగ్ విభాగానికి వెన్నెముకలా నిలిచాడు. ప్రస్తుతం ఢిల్లీ 8 పాయింట్లతో ఉండగా, కేకేఆర్ 7 పాయింట్లతో వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయే జట్టుకు ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే.
ఇవి కూడా చదవండి






