రహానే టి20 క్రికెట్ కు పనికిరాడు, బ్యాటింగ్ కోచ్ సంచలనం..!
ఐపీఎల్(IPL) 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ప్రదర్శన ఆ జట్టు అభిమానులకు ఒక పీడకలలా మారింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో వెనుకబడిన కేకేఆర్ పరిస్థితిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కెప్టెన్సీలోనూ ఘోరంగా విఫలమవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో, ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే జట్టును వీడిన కేకేఆర్ మాజీ కోచ్ చంద్రకాంత్ పండిట్, రహానే బ్యాటింగ్ తీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
చంద్రకాంత్ పండిట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రహానే టీ20 బ్యాటింగ్ శైలినిపై మాట్లాడాడు. అజింక్య రహానే క్లాసిక్ ప్లేయర్ అనడంలో సందేహం లేదు. కానీ ఆధునిక టీ20 క్రికెట్లో అవసరమైన వేగం (Strike Rate) అతని బ్యాటింగ్‌లో కనిపించడం లేదన్నాడు. పవర్ ప్లే ఓవర్లను సద్వినియోగం చేసుకోవడంలో తడబడుతున్నాడని.. ఇది జట్టుపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని కామెంట్ చేసాడు. కేకేఆర్ ఘోర వైఫల్యాల వెనుక కెప్టెన్ సరైన ఫామ్‌లో లేకపోవడమే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు.
బ్యాటింగ్ మాత్రమే కాదు, రహానే తీసుకుంటున్న నిర్ణయాలు కూడా జట్టుకు శాపంగా మారుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. బౌలర్ల మార్పిడిలో వైఫల్యం, క్లిష్ట సమయాల్లో ఫీల్డ్ సెట్టింగ్‌లో అస్పష్టత కేకేఆర్‌ను వరుస ఓటముల్లోకి నెట్టేశాయి. ఐపీఎల్ 2026 సీజన్ లో కేకేఆర్ సాగిస్తున్న ‘హారర్ రన్’ చూస్తుంటే.. రహానేను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై మేనేజ్మెంట్ పునరాలోచనలో పడిందని సమాచారం. రహానే తన బ్యాటింగ్ గేర్‌ను మార్చకపోతే లేదా జట్టును విజయపథంలో నడిపించకపోతే, వచ్చే మ్యాచ్‌ల్లో అతని స్థానం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.






