Tandanana: కన్నుల పండువగా ‘‘తందనాన’’ గ్రాండ్ ఫైనల్స్
హైదరాబాద్ లోని అన్నమాచార్య భావన వాహిని ఆధ్వర్యంలో పద్మశ్రీ డా. శోభారాజు గారు నిర్వహించిన తందనాన పోటీల గ్రాండ్ ఫైనల్స్ విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమం ముందుగా విష్ణు సహస్రనామ పారాయణంతో ప్రారంభమై, అనంతరం సన్నాయి, మేళం, వేద పఠనంతో భక్తి వైభవంగా నిర్వహించబడిరది. తదుపరి అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు ‘‘హరి అవతారమీతడు, నడిచే వాత్సల్యం, శ్రీ చిన్నజీయర్ స్వామి’’ అన్నమాచార్య కీర్తనలను పూజ్యులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారి సమక్షంలో ఎంతో భక్తి భావంతో, శ్రద్ధగా ఆలపించారు. అనంతరం గ్రాండ్ ఫైనల్‌కు ఎంపికైనవారు
‘‘సిన్నెక్క, రాజీవలోచనాయ, కొండలలో నెలకొన్న, తిరుమల గిరిరాయ’’ వంటి అన్నమాచార్య సంకీర్తనలతో పాటు మరికొన్ని కీర్తనలను ఆలపించగా, మొత్తం 12 మంది పాల్గొనేవారు ఈ దశలో తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలకు ‘‘వందేమాతరం శ్రీనివాస్’’ గారు మరియు ప్రముఖ గాయని ‘‘సునీత’’ గారు, ప్రముఖ దర్శకులు శ్రీ శేఖర్ కమ్ముల గారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి, పాల్గొన్న కళాకారులకు అమూల్యమైన సూచనలు, సలహాలు అందిస్తూ హృదయపూర్వకంగా ప్రోత్సహించి ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయని శ్రీమతి గాయత్రి గారు హాజరై, కార్యక్రమానికి మరింత గౌరవం చేకూర్చారు.
ఈ పోటీల అనంతరం ప్రతిభ ఆధారంగా విజేతలను ప్రకటించారు.
సబ్ జూనియర్ విభాగం: మేఘన
జూనియర్ విభాగం: మేఘన
సీనియర్ విభాగం: హరి చందన
ఎంపికైన విజేతలకు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సువర్ణ పతకాలను ప్రదానం చేయనున్నారు.
ఈ సందర్భంగా పూజ్యులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడుతూ, గ్రాండ్ ఫైనల్లో పాల్గొన్న పిల్లలు మరియు కళాకారులను ప్రశంసిస్తూ, ‘‘ఈ తరానికి మైకేల్ జాక్సన్ సంగీతం ఎంత ప్రభావవంతమో, అదే విధంగా అన్నమాచార్య కీర్తనలు డా. శోభారాజు గారి ద్వారా ప్రపంచమంతా మారుమ్రోగుతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. ఈ తరంలోని పిల్లలు కళలను అభ్యసించడం వల్ల శాంత స్వభావంతో, పెద్దల పట్ల గౌరవభావంతో ఎదుగుతున్నారని తెలిపారు. పిల్లలు తప్పకుండా కళలను నేర్చుకొని, మంచి మార్గంలో ప్రయాణిస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని పూజ్యులు హితవు పలికారు. అనంతరం ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లకు, ఫైనలిస్టులకు స్మారక చిహ్నాలు (మోమెంటోలు) మరియు బహుమతులు అందజేశారు. అలాగే ప్రత్యేకంగా పాల్గొన్న కళాకారులకు కూడా మోమెంటోలు ప్రదానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు శ్రీ శేఖర్ కమ్ముల గారు మాట్లాడుతూ, డా. శోభారాజు గారి పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఆమె గాన స్వరం, పాటల లోతు తనను ఎంతో ప్రభావితం చేసిందని పేర్కొంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరికీ అభినందనలు తెలిపారు.
అనంతరం ప్రముఖ గాయని సునీత గారు మాట్లాడుతూ, పాల్గొన్న ప్రతిభావంతులను ప్రశంసిస్తూ, భక్తి సంగీతం ద్వారా మన సంస్కృతి పరిరక్షణ జరుగుతోందని పేర్కొన్నారు. తదుపరి వందేమాతరం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఎంతో ప్రాచుర్యం పొందిన ‘‘కొండలలో నెలకొన్న’’ అన్నమాచార్య కీర్తనను ప్రత్యేకంగా ప్రస్తావించి, ఆ కీర్తన ఈ కార్యక్రమంలో ఆలపించబడిన విధానాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.
చివరగా పద్మశ్రీ డా. శోభారాజు గారు ఈ కార్యక్రమం గురించి, పూజ్యులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సుల గురించి, పాల్గొన్న కళాకారులు, విద్యార్థుల కృషి గురించి ప్రశంసిస్తూ తన మాటలను తెలియజేశారు. చివరన అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు ‘‘తందనాన’’ అన్నమాచార్య కీర్తనను ఆలపించి, అందరినీ ఆకట్టుకుని కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.
తందానన 2025 పోటీలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 700కి పైగా ఆడిషన్లు వచ్చాయి. వివిధ దేశాల గాయనీగాయకులను ఒకచోటకు చేర్చింది.
శ్రేయాస్ మీడియా, ఈవెంట్ పార్టనర్‌గా, మరియు ఈవెంట్ నీడ్జ్, టెక్నాలజీ పార్టనర్‌గా, పోటీ మరియు ప్రపంచ ఆడిషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ కార్యక్రమానికి తెలుగు టైమ్స్ ఎడిటర్, సిఇఓ శ్రీ వెంకట సుబ్బారావు చెన్నూరి ముఖ్య సలహాదారుగా మార్గనిర్దేశం చేయగా, ఈవెంట్ నీడ్జ్ ఎండి, సిఇఓ శ్రీమతి జ్యోత్స్న కొంపల్లి ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా వ్యవహరించి, మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేసి పర్యవేక్షించారు.
ఈ పోటీల్లో ఫైనల్ లో గెలిచిన విజేతలకు ఇచ్చే బంగారు పతకాలను మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ స్పాన్సర్ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని అన్నమాచార్య భావన వాహిని మరియు ఈటీవీ, లైఫ్ స్పిరిచ్యువల్ సంస్థలు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ల సహకారంతో సంయుక్తంగా నిర్వహించాయి.






