KCR: కేసీఆర్ ఇప్పటికైనా ఫాంహౌస్ దాటి బయటకు వస్తారా..?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) పైనే ఉంది. దాదాపు ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. అయితే, ఈ గర్జన కేవలం ప్రెస్ మీట్‌కే పరిమితమా? లేక నిజంగానే ఆయన క్షేత్రస్థాయిలోకి వస్తారా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
తెలంగాణ రాజకీయ యవనికపై కేసీఆర్ అంటే ఒక ప్రభంజనం. ఆయన మాటల్లో ఉండే పదును, ప్రత్యర్థులపై విసిరే విమర్శనాస్త్రాలు క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ అనుసరిస్తున్న మౌన ముద్ర పార్టీ శ్రేణులను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. తాజాగా ఆయన మీడియా ముందుకొచ్చి, “ఇక నేను వస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం తోలు తీస్తా” అని హెచ్చరించడం చర్చనీయాంశమైంది.
కేసీఆర్ శైలి మొదటి నుంచీ విభిన్నం. ఉద్యమ సమయంలోనూ, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన కీలక నిర్ణయాల సమయంలో ఫాంహౌస్‌కే పరిమితం అవుతారనే విమర్శ ఉంది. ఎన్నికల ఓటమి తర్వాత రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్తుంటే, బీఆర్ఎస్ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. కేటీఆర్, హరీశ్ రావు ఎంత పోరాడుతున్నా.. బాపు వస్తేనే ఆ ఇంపాక్ట్ ఉంటుందని కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. అయితే, ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి “వస్తున్నా” అని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ ఫాంహౌస్‌కే పరిమితమవ్వడం ఒక అలవాటుగా మారిపోయిందనే అసహనం క్యాడర్లో కనిపిస్తోంది.
కేటీఆర్, హరీశ్ రావు సోషల్ మీడియాలో, అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని ధీటుగానే ఎదుర్కొంటున్నారు. కానీ, గ్రామీణ స్థాయిలో ప్రజలను ఉర్రూతలూగించడంలో కేసీఆర్ మార్క్ మ్యాజిక్ లోపించింది. రేవంత్ రెడ్డి తన మాస్ ఇమేజ్‌తో ప్రజల్లోకి దూసుకుపోతుంటే, దాన్ని అడ్డుకోవడానికి కేవలం ట్వీట్లు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు సరిపోవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధినేత నిత్యం అందుబాటులో ఉండాలని కార్యకర్తలు కోరుకుంటారు. కానీ కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ కే పరిమితమవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాల మీద కేసీఆర్ తక్షణమే స్పందించకుండా, నెలల తరబడి వేచి చూడటం వల్ల ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లవుతోంది. “నేను బయటకు వస్తా” అనే మాట పదే పదే వినిపిస్తున్నా, అది ఆచరణలోకి రాకపోవడంతో కార్యకర్తల్లో నమ్మకం తగ్గుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమైతే, పార్టీ నుంచి వలసలు పెరిగే ప్రమాదం ఉంది. కార్యకర్తలు నైతికంగా దెబ్బతింటే, తిరిగి పుంజుకోవడం పార్టీకి కష్టసాధ్యం.
కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి కానీ, అడుగు మాత్రం ఫాంహౌస్ దాటడం లేదన్న విమర్శ నిజం కాకూడదని బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నాయి. తాజా హెచ్చరిక కేవలం మీడియా హెడ్‌లైన్స్ కోసం కాకుండా, ప్రజా పోరాటాల కోసం అయితేనే బీఆర్ఎస్కు పూర్వ వైభవం దక్కుతుంది. రేవంత్ రెడ్డి వేగాన్ని కట్టడి చేయాలన్నా, చేజారిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలన్నా కేసీఆర్ ప్రెస్ మీట్ టైగర్ గా కాకుండా ప్రజాక్షేత్ర పోరాట యోధుడుగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






