KCR – Jagan: కేసీఆర్ కామెంట్స్.. జగన్‌కు ‘స్నేహ’ సంకటం..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిత్రత్వం, శతృత్వం అనేవి కేవలం వ్యక్తుల మధ్యే కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల చుట్టూ తిరుగుతుంటాయి. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో జగన్‌కు ఉన్న సాన్నిహిత్యం, ప్రస్తుత నీటి యుద్ధాల నేపథ్యంలో జగన్‌ను తీవ్ర ఆత్మరక్షణలో పడేస్తోంది. కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అటు చంద్రబాబుకు మేలు చేకూరుస్తూ, ఇటు జగన్‌ను ఇరకాటంలోకి నెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఆరాధ్య దైవం కావొచ్చు, కానీ సగటు ఆంధ్రుడి దృష్టిలో ఆయన రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు. విభజన వల్ల కలిగిన ఆర్థిక లోటు, రాజధాని లేకపోవడం వంటి సమస్యలన్నీ కేసీఆర్ ఉద్యమ ఫలితమేనని ఏపీ ప్రజలు బలంగా నమ్ముతారు. అటువంటి వ్యక్తితో జగన్ బహిరంగంగా స్నేహం చేయడం మొదటి నుంచీ విమర్శలకు దారితీస్తూనే ఉంది. తాజాగా జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో వెలిసిన కేసీఆర్-జగన్ ఉమ్మడి ఫ్లెక్సీలు ఈ బంధాన్ని మరోసారి చర్చనీయాంశం చేశాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే జగన్‌కు వ్యక్తిగత స్నేహాలే ముఖ్యమా? అనే ప్రశ్నను సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది ఒక అస్త్రంగా మారింది.
కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడుతున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి.. “చంద్రబాబు తెలంగాణకు రావలసిన నీటిని అడ్డుకుంటున్నారు” అని ఆరోపించడం విశేషం. నిజానికి ఇది కేసీఆర్ చంద్రబాబుపై చేసిన విమర్శ అయినప్పటికీ, ఏపీ కోణంలో చూస్తే ఇది చంద్రబాబుకు లభించిన ఒక ప్రశంస. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం చంద్రబాబు గట్టిగా నిలబడుతున్నారని, అందుకే పక్క రాష్ట్ర నేత ఆయనను తప్పుబడుతున్నారని ఏపీ ప్రజల్లో ఒక సానుకూల సంకేతం వెళ్లింది. ఒక రకంగా చెప్పాలంటే, ఏపీ ప్రయోజనాల పరిరక్షకుడిగా చంద్రబాబును కేసీఆర్ తన వ్యాఖ్యల ద్వారా ధ్రువీకరించారు.
కేసీఆర్ ఏపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నా, నీటి వాటాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య గొడవ జరుగుతున్నా జగన్ మౌనంగా ఉండడం లేదా కేసీఆర్‌తో దోస్తీ కొనసాగించడం వైసీపీకి మైనస్‌గా మారుతోంది. ఒకవైపు చంద్రబాబు రాష్ట్రం కోసం పోరాడి కేసీఆర్ చేత విమర్శలు చేయించుకుంటుంటే, జగన్ మాత్రం అదే కేసీఆర్‌తో ఫ్లెక్సీలు కట్టించుకుంటున్నారా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా కేసీఆర్-జగన్ స్నేహాన్ని గొప్పగా ప్రచారం చేయడం వ్యూహాత్మక తప్పిదంగా కనిపిస్తోంది. ఇది క్షేత్రస్థాయిలో ఉన్న తటస్థ ఓటర్లలో ప్రతికూల భావనను కలిగిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులను విమర్శించిన వ్యక్తితో చేతులు కలపడం జగన్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది.
రాజకీయాల్లో వ్యూహాలు వేర్వేరుగా ఉండవచ్చు, కానీ అవి రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు కాకూడదు. జగన్ తన రాజకీయ ఉనికి కోసం కేసీఆర్ అండను కోరుకుంటున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఈ ఫ్లెక్సీలు, ప్రస్తుత పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. జగన్ తన వైఖరిని స్పష్టం చేయకపోతే, జగన్ హయాంలో కేసీఆర్ మాట కోసమే ఏపీ ప్రయోజనాలను పణంగా పెట్టారు అనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంది.
కేసీఆర్ తన ప్రసంగంలో జగన్ పేరు ఎత్తకపోయినా, చంద్రబాబుకు క్రెడిట్ ఇవ్వడం ద్వారా పరోక్షంగా జగన్‌ను కార్నర్ చేశారు. రాజకీయంగా ఇది జగన్‌కు పెద్ద సవాలే. రాష్ట్ర సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న నీటి సమస్యల విషయంలో మౌనం వహించడం లేదా విభజన కారకులతో స్నేహం చేయడం వల్ల రాజకీయంగా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఏపీలో మళ్లీ పట్టు సాధించాలంటే, జగన్ తన స్నేహం కంటే రాష్ట్ర ప్రయోజనాలే మిన్న అనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






