రియల్ ఎస్టేట్‌లో శ్రీరామ్ ప్రాపర్టీస్ 15వేల కోట్ల పెట్టుబడులు

చెన్నై ప్రధాన కార్యలయంగా పనిచేస్తున్న శ్రీరామ్ గ్రూపునకు చెందిన అనుబంధ సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్‌రంగంలో తనదైన ముద్రను వేస్తోంది. ఇప్పుడు చౌకరకం గృహాలపై దృష్టి పెట్టింది. వచ్చే 7-8 సంవత్సరాల్లో దేశంలోని ఆరు అతి పెద్ద నగరాల్లో గృహ నిర్మాణ ప్రాజెక్టులపై రూ.15వేల కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీకి చెందిన 30 ప్రాజెక్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. వాటిని అభివృద్ధి కూడా చేస్తుంది. కేంద్రప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి మౌలికరంగం హోదా కల్పించడం, కొత్తగా గృహాలు కొనుగోలు చేసే వారికి బిల్డర్లకు రాయితీలతో పాటు వడ్డీపై కూడా రాయితీలు ప్రకటించడంతో ఈ రంగంపై శ్రీరామ్ దృష్టి పెట్టింది. ఇప్పటికే 15 మిలియన్ చదరపు అడుగుల గృహ నిర్మాణ ప్రాజెక్టులను అభివృద్ది చేసి డెలివరీ కూడా చేసింది. ప్రస్తుతం 25-30 ప్రాజెక్టులకు కొనసాగుతున్నాయని సుమారు 60 మిలియన్ చదరపు అడుగుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, అవి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వైజాగ్, కోయంబత్తూరు, కోలకతాలతో కొనసాగుతున్నాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. మురళీ చెప్పారు. మొత్తం 60 మిలియన్ చదరపు అడుగుల్లో 18 మిలియన్ చదరపు అడుగులు నిర్మాణదశలో ఉన్నాయని, మిగిలినవి దశల వారీగా పనులు మొదలుపెడతామని అన్నారు.
ఈ ప్రాజెక్టులపై మొత్తం రూ.15వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని, వీటికి నిధులు అంతర్గతంగా సమకూర్చుకుంటామని, కొంత మొత్తం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇన్వెస్టర్ నుంచి ఈ ప్రాజెక్టుల కోసం 460 మిలియన్ డాలర్లను సేకరించామని, ప్రస్తుతం నిధులు సేకరించే ఆలోచనలేదని ఆయన అన్నారు. శ్రీరామ్ ప్రాపర్టీస్‌లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఇలా ఉన్నాయి. వాల్టన్ స్ట్రీట్, స్టార్‌వుడ్ క్యాపిటల్, టీపీజీ క్యాపిటల్, టాటా ఆపర్చునిటీస్ ఫండ్ హైపో, సన్ అపోలో, ఎఎస్‌కె., మోతీలాల్ ఒస్వాల్, అమ్‌పస్ల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియలున్నాయి.